పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలతో పెంచి పోషిస్తోంది. అందుకే అది ఉగ్రవాదానికే జై కొట్టింది. పహల్గామ్ దాడికి తెగబడింది. ప్రతిగా ప్రతీకారంగా భారత్ కేవలం ఉగ్ర స్థావరాలపైనే దాడికి దిగింది. వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. అయినా బుద్ధిరాని పాక్, భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది. యుద్ధానికి సిద్ధపడింది. డ్రోన్ దాడులతో బరితెగించింది. మొత్తంగా ఇప్పుడు భారత్, పాక్‌ల మధ్య యుద్ధం అనివార్యం అయింది. ఇక ఈ యుద్ధమే చివరిది కావాలి. ప్రపంచపటంలో పాక్ ఉనికి ఉంటుందా? లేదా? అన్నది తేల్చాలి.
గతానుభవాల దృష్ట్యా పాక్ కు గట్టి గుణపాఠం చెప్పాలి. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తే, భారత పౌరులు లక్ష్యంగా దాడులకు దిగడమేంటి? మన రక్షణ దళాలు అత్యంత సమర్థంగా వాటిని తిప్పికొట్టడమే గాకుండా, కరాచీకి చెందిన నావల్ బేస్‌పై దాడులు చేసింది. అలాగే లాహోర్ ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేసింది. ఒకటి రెండు దాడుల దండనతో ముగిసే వ్యవహారాన్ని పూర్తిస్థాయి యుద్దంగా మార్చేలా పాక్ తనకుతాను రంగంలోకి దిగింది. అందివచ్చిన ఈ అవకాశాన్ని భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. పాక్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను పూర్తిగా మట్టుబెట్టాలి. ఉగ్రవాద చర్యలకు భవిష్యత్‌లో పాక్ అండగా నిలవకుండా ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది.
పాకిస్తాన్ కు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. యుద్ధమంటే ఆషామాషీ కాదని గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్వని పాక్, మళ్ళీ యుద్ధంలోకి దిగింది. ప్రస్తుతం భారత్ దాడులకు పాక్ కకావికలమవుతోంది. అల్లకల్లోలంగా మారింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి పారిపోయారు. భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో భయం అలుముకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు మద్దతు కరువైంది. అంతర్గతంగా ఆ దేశంలోని ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో దాపురించింది.
సరిహద్దుల వద్ద ఉల్లంఘనలకు పాల్పడుతూ పాక్ జరిపిన దాడులకు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. భారత్‌లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో పెద్దఎత్తున దాడికి విఫలయత్నం చేసింది. అయితే, అత్యంత చాకచక్యంగా, అత్యాధునిక ఆయుధ సంపత్తితో, త్రివిద దళాల సమన్వయంతో ఆ దాడుల్ని సమర్థంగా అడ్డుకున్నామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. ప్రతిగా లాహోర్ సహా పాక్ కు చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ సైన్యం భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాక్ డ్రోన్లు, రాకెట్లతో సరిహద్దుల్లో దాడులకు పాల్పడింది. అయితే భారత సైన్యం వాటిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసింది.
కాగా పహల్గాం దుర్ఘటన అనంతరం భారత సరిహద్దులో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు బలోచిస్తాన్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఏకంగా పాక్ సైన్యంపై విరుచుకుపడింది. బీఎల్‌ఏకు చెందిన ‘డెత్ స్క్వాడ్’ కలత్ జిల్లాలోని మంగోచెర్ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను కూడా తన కంట్రోల్‌లో ఉంచుకుంది. బలోచ్ తిరుగుబాటుదార్లు ఆర్మీ క్యాంపుపై దాడి చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ తన సైన్యాన్ని భారత్ సరిహద్దుకు తరలిస్తున్న తరుణంలో బలూచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది.
ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న దాయాది తమ దేశంలో టెర్రరిస్టులే లేరని ఇంతకాలంగా బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలో యూకేలోని ఇండియా హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి ప్రపంచ దేశాల ముందుకు కీలక ఆధారాలు తీసుకొచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపుల మీద భారత్ జరిపిన దాడుల్లో జైషే ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజహర్ చనిపోయాడు. అతడితో పాటు ఇతర టెర్రరిస్టుల అంత్యక్రియలకు అక్కడి ఆర్మీ, సర్కారు అధికారులు హాజరై, నివాళులు అర్పిస్తున్న ఫొటోలను బయటపెట్టారు. టెర్రరిస్టుల శవపేటికపై పాక్ జెండాలు కప్పి ఉన్నట్లు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రదాదుల వెనుక ఎవరు ఉన్నారు? వాళ్లకు ఇన్నాళ్లూ అండగా ఉంటోంది ఎవరనేది? ప్రపంచానికి తేటతెల్లమైంది. టెర్రరిస్టుల వెనుక పాకిస్తానే ఉందనే దానికి ఇంతకుమించిన ఆధారం మరోటి ఉండదు. దీంతో ప్రపంచం ముందు పాక్ అడ్డంగా బుక్కయింది. ఇక ఇప్పుడు పాక్ తన మొహం ఎక్కడ పెట్టుకుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడంలేదు.
ప్రజలను సైతం దివాళా తీయించి, అడుక్కునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజార్చింది. అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది. ఇటు ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్ చేయాలంటూ పాక్ పౌరులకు ప్రభుత్వం విజ్ఞప్తులు చేసే పరిస్థితి నెలకొంది. అభివృద్ధి చెందడం పక్కన పెట్టి ఉగ్రమూకలను పెంచి పోషించడానికే బోలెడు ఖర్చు చేస్తున్నది. గత పాలకులను జైళ్ళల్లో పెడుతూ, సైన్యం, రాజకీయ నాయకులు అధికారాన్ని పంచుకుంటూ, కలిసికట్టుగా పాక్ ను దోచుకుంటున్నారు. ఎంతసేపూ భారత్ మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న పాక్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన ఆఖరి అవకాశంగా ఈ యుద్ధాన్ని మలచుకోవాలి. ఓ వైపు భారత్ తో యుద్ధం, మరోవైపు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో అంతర్యుద్ధం, ప్రజల తిరుగుబాటు, చేతులెత్తేసిన సైన్యం, పారిపోయిన ప్రధాని, సైన్యాధ్యక్షుడినే అరెస్టు చేసిన సైన్యం ఏమిటీ దైన్యం? ఒక్క టెర్రరిస్టుల కోసం పాక్ టెర్రర్ అవుతున్న తీరు అత్యంత దారుణంగా, దయనీయంగా ఉంది.

