న్యూ ఢిల్లీ, మే 8 (అడుగు న్యూస్):
పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ తానేంటో పాకిస్తాన్ కు రుచి చూపిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట విరుచుకుపడింది. అయితే భారత్ ఈ మెరుపు దాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరును ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
అధికారిక వర్గాల సమాచారం మేరకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరును సూచించింది ప్రధాని మోడీ. “మన మహిళలు భర్తలను కోల్పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని భారత్ ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా మన ప్రతిస్పందన కచ్చితంగా కనిపించాలి” అని మోడీ అధికారులకు స్పష్టం చేసినారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలో ఉన్న పర్యటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ ఉన్న జంటల్లో పురుషులను వేరు చేశారు. ఆ తర్వాత వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. అయితే ఉగ్రవాదులు చేసిన జంటల్లో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లైన నవవధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షి కూడా ఉన్నారు. భారత నేవీ అధికారి అయిన వినయ్ నర్వాల్ను ముష్కరులు కాల్చి చంపేశారు. తన కాళ్ల పారాణి ఆరకముందే హిమాన్షి జీవితంలో చీకటి అలుముకుంది. దీంతో వినయ్ మృతదేహం వద్ద కూర్చుని గుండెలవిసేలా ఆమె రోదించింది. అందుకు సంబంధించిన ఫొటో దేశాన్ని కుదిపేసింది.
అయితే హిందూ మహిళలు తమ వివాహ స్థితిని సూచించడానికి నుదిటిన సిందూరం పెట్టుకుంటారు. పెళ్లి మండపంపై వరుడు, వధువుకు తొలిసారి సిందూరం పెడతాడు. కానీ హిమాన్షి అలా జరిగిన ఆరు రోజులకే భర్తను, తన ఐదో తనాన్ని కోల్పోయింది. అలా 26 మంది మహిళల సిందూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకే భారత సైన్యం చేపట్టిన దాడికి ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ అని పెట్టినట్లు తెలుస్తోంది.
అందరినీ ఆకర్షించిన ఫోటో!
ఆపరేషన్ సిందూర్ పేరుతో మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు జరిపిన కొద్ది సేపటికే రక్షణ మంత్రిత్వ శాఖ ఆపరేషన్ సిందూర్ అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది. తర్వాత.. అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.
ఇంగ్లిష్‌లో రాసిన అక్షరాల్లో ”SINDOOR”లో ఒక ‘O’లో కుంకుమతో నిండిన గిన్నె ఉంది. మరో ‘O’ చుట్టూ చెల్లాచెదురుగా కుంకుమ పడి ఉంది. ఆ పోస్టునే భారతీయులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు.

