పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి పై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అందులో భాగాన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, దేశ భద్రతా పరిస్థితులపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ అవసరమని తెలిపారు. ఈ దాడి దేశ భద్రతపై పెద్దస్ధాయిలో ముప్పు అని తెలుస్తుందని, ఇలాంటి ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ద్వారా ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకొని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగాలని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోవైపు, పహల్గామ్ దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్రం స్పందించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

