టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి ఆర్. రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. జపాన్ రాజధాని టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో ఇటీవల నిర్వహించిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జపాన్ పారిశ్రామికవేత్తలతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా వివిధ రంగాలకు చెందిన జపాన్ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారిక బృందం తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విధానాలను వివరిస్తూ ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. ఇది మీకు హృదయపూర్వక ఆహ్వానం చెబుతోంది. జపాన్ ఉదయించే సూర్యుడి దేశంగా పేరొందినట్టు, తెలంగాణ ‘రైజింగ్’ నినాదంతో అభివృద్ధి దిశగా దూసుకెళుతోంది. జపాన్ ప్రజల నుంచి నేర్చుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. టోక్యో నగరం మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణల పరంగా గొప్ప ప్రేరణ,” అని పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాదును అభివృద్ధి చేయడంలో టోక్యో నుంచి మోడల్స్‌ను తీసుకున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం స్థిరమైన విధానాలు, నైపుణ్యం గల శక్తివంతమైన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను జపాన్ కంపెనీలకు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, టెక్స్‌టైల్స్, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. భారత్-జపాన్ కలిసికట్టుగా పనిచేస్తే, ప్రపంచానికి ఉత్తమమైన భవిష్యత్‌ను నిర్మించవచ్చని ఆకాంక్షించారు. సమావేశంలో భారత రాయబారి సీబీ జార్జ్ రెండు దేశాల మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు. జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ, తెలంగాణతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన ఫ్యూచర్ సిటీ (నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీ) మరియు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులపై రూపొందించిన ప్రచార వీడియోలు జపాన్ పారిశ్రామికవేత్తల్లో ఆసక్తిని కలిగించాయి. అనంతరం, రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలను, విధానాలను వివరించగా, రోడ్‌షో ముగిసిన తర్వాత జపాన్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ అధికార బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.

