2008 ముంబై దాడులు మిగిల్చిన విషాదాల గాయాలింకా మానలేదు. అయితే ఆ కుట్రల వెనక ఎవరెవరు ఉన్నారన్నది కూడా ఇంకా తేలలేదు. ముంబై దాడులు సహా, అనేక ఉగ్రవాద దాడులు, కుట్రల్లో పాక్ ప్రమేయం ఉన్నట్లు భారత్ అనేక ఆధారాలు సేకరిస్తూనే ఉంది. కానీ, పాక్ తోసిపుచ్చుతూనే ఉంది. ప్రపంచం ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టడంలో భారత్ విజయం సాధించింది. కసబ్ తదితరులను ఉరితీత తర్వాత కూడా పాక్ ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ వేదికలపై భారత్ ఎండగడుతూనే ఉంది. పాక్‌కు గట్టిగా బుద్ది చెప్పేలా చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడడం లేదు. గతంలో పాలకులు పాక్ పట్ల ఉదాసీనంగా నిర్లిప్తంగా వ్యవహరించారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి తదితర సందర్భాల్లో పాక్‌ను పూర్తిగా కట్టడి చేసి ఉంటే ఇవాళ ఈ దుర్గతి పట్టేది కాదు.
తాజాగా ఇప్పుడు తహవ్వుర్ రాణాను ఇండియాకు రప్పించడంలో సఫలం అయినట్లే, ఇదే సందర్బంలో రాణా నుంచి వివరాలు సేకరిస్తే..ముంబై దాడుల వెనక కుట్రలను ఛేదించగలం. రాణా అంత సులువుగా బయటపడతాడని అనుకోవడానికి లేదు. భారత్ పట్ల నరనరాన వ్యతిరేకతను నింపుకున్న రాణా ముంబై దాడుల కోసం ఎంతగా తెగించాడన్నది ప్రపంచ దేశాలతో పాటు పాక్‌కు కూడా అర్థం అయివుంటుంది. ముంబై దాడుల వెనక ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్ మాస్టర్ మైండ్స్ గా వ్యవహరించారు. 166 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకొన్నారు. అమెరికా చట్టాల్లోని లొసుగుల్ని వాడుకొని భారత్‌కు దొరక్కుండా తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. చివరికి ఆ ఇద్దరిలో ఒకరిని మన జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌కు తీసుకొచ్చింది. మరొకరు అమెరికా జైల్లోనే ఉన్నాడు. ఆ ఇద్దరే తహవ్వుర్ రాణా, డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ. వీరిద్దరి వయస్సు 64 ఏళ్లు. వీరిని ముంబై దాడుల కుట్రదారులుగా గుర్తించడంలో ఎన్‌ఐఎ తీవ్రంగా కృషి చేసింది. ఈ ఇద్దరూ పాక్‌లోని హసన్ అబ్దుల్‌లోని సైనిక అకాడవిూ అయిన క్యాడెట్ కాలేజ్ (సీసీహెచ్)లో చదువుకున్నప్పటి నుంచి మిత్రులు. ఆ తర్వాత ఇద్దరూ ఉగ్రవాదులు గా మారడం విచిత్రం. డేవిడ్ హెడ్లీ పాకిస్థానీ దౌత్యవేత్త, బ్రాడ్‌కాస్టర్ అయిన దావూద్ సయ్యద్ గిలానీ, ఓ అమెరికా జాతీయురాలికి పుట్టాడు. ఆ తర్వాత గిలానీ కుటుంబం పాక్‌కు వలస వెళ్లింది. అక్కడే హెడ్లీ సీసీహెచ్‌లో చేరాడు. ఇక తహవ్వుర్ రాణా 1961లో ఓ హైస్కూల్ ప్రిన్సిపల్ కుటుంబంలో జన్మించాడు. ఇతడూ సీసీహెచ్‌లోనే చేరాడు. అక్కడే తొలిసారి హెడ్లీ-రాణా మిత్రులుగా మారారు. అక్కడి నుంచే వారి ఉగ్రరచనలకు బీజం పడిందని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో హెడ్లీ తల్లితో కలిసి అమెరికాలోని ఫిలడెల్ఫియాకు వెళ్లిపోయాడు. అక్కడ అతడు మాదక ద్రవ్యాల వ్యాపారంతోపాటు, కీలక సమాచారాన్ని ఏజెన్సీలకు విక్రయించేవాడు. పాక్‌లో లష్కరే, సైన్యానికి, ఇటు- అమెరికాలోని సీఐఏకు ఇన్ఫర్మేషన్ చేరవేసేవాడు. మరోవైపు రాణా పాక్ ఆర్మీ మెడికల్ కోర్‌లో కెప్టెన్ హోదాలో పని చేశాడు. 1997లో ఆర్మీని వదిలేసి.. భార్యతో కలిసి కెనడాకు వలస వెళ్లి, 2001 నాటికి పౌరసత్వం సంపాదించాడు. టొరెంటోలో ‘ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్’ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత దాని కార్యాలయాలను చికాగో, న్యూయార్క్ ల్లోనూ తెరిచాడు. ఈ కంపెనీ ముసుగులోనే అతడు ముంబై దాడులకు కుట్రను అమలు చేశాడని బహిర్గతం అయింది.
2006 నుంచి ముంబై దాడులకు కుట్ర రచన మొదలైంది. ఇదంతా ఎన్‌ఐఎ సేకరించగలిగింది. అదే ఏడాది హెడ్లీ తొలిసారి ముంబైని సందర్శించాడు. అప్పుడు ‘మెస్సర్స్ ఇమిగ్రేషన్ లా సెంటర్’ పేరిట ఓ కార్యాలయం ఏర్పాటుకు ఆర్‌బీఐకి పత్రాలు సమర్పించాడు. వీటిపై రేమాండ్ జోసెఫ్ శాండర్స్ అనే వ్యక్తి సంతకాలున్నాయి. ఇది రాణాకు చెందిన ‘ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్’కు అనుబంధంగా పనిచేసింది. ఇందుకోసం టార్డియో ఏసీ మార్కెట్‌లో ఆఫీస్ స్పేస్ తీసుకొన్నాడు. భారత్ వచ్చినప్పుడు దానిని స్థావరంగా వాడుకున్నాడు. ముంబైలో మొత్తం ఎనిమిది సార్లు పర్యటించి రెక్కీలు నిర్వహించాడని ఎన్‌ఐఎ పసిగట్టింది. దాడులకు రెండు వారాల ముందు రాణా స్వయంగా భారత్‌కు వచ్చాడు. అతడు ఫైవ్ స్టార్ హోటల్ పొవాయ్‌లో దాదాపు 10 రోజుల పాటు తిష్ఠ వేసి కుట్రలు పన్నాడు. డేవిడ్ హెడ్లీకి అవసరమైన వీసాను రాణానే ఇప్పించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇందుకోసం అతడి పేరు, తండ్రి వివరాలను తప్పుగా చూపించారు. ముంబైలో తన ఎనిమిది రెక్కీల సందర్భంగా హెడ్లీ నిరంతరం రాణాతో టచ్‌లో ఉన్నాడు. ఇందుకోసం 231 ఫోన్‌కాల్స్ చేశాడని ఎన్‌ఐఎ గుర్తించింది. అతడు చేసిన సాయానికి ప్రతిగా..పాక్ ఐఎస్‌ఐ అధికారులతో మాట్లాడి ఓ డీల్ కుదిర్చాడు. రాణా పాకిస్థాన్‌ను సందర్శించడానికి వీలుగా అతడికి మేజర్ ఇక్బాల్‌ను పరిచయం చేశాడు. ఆ మేజర్ రాణాతో మాట్లాడినట్లు తేలింది. భారత్‌లో ఉన్నప్పుడు నేరుగా పాక్‌కు కాల్స్ చేయోద్దని హెడ్లీకి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ముంబై దాడుల తర్వాత కూడా హెడ్లీ-రాణా టచ్‌లో ఉన్నారు. ఇక విజయవంతంగా ముంబైలో మారణ హోమం సృష్టించి నందుకు ఉగ్రవాది లష్కరే సాజిద్‌ను రాణా అభినందించాడు. ఈ దాడిలో మరణించిన ఉగ్రవాదులకు పాక్ అత్యున్నత పురస్కారం ‘నిషాన్ ఈ హైదర్’ ఇవ్వాలని హెడ్లీ వద్ద రాణా వ్యాఖ్యానించాడు. భారతీయులకు అలా జరగాల్సిందేనని కూడా వ్యాఖ్యానించాడు. 2009 అక్టోబర్ 3న చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో హెడ్లీని ఎఫ్‌బీఐ అరెస్టు చేయడంతో ఇద్దరి స్నేహం ముగిసింది.
హెడ్లీ సీఐఏకు పని చేస్తున్నా.. తరచూ పాక్‌కు వెళ్లి రావడంపై అమెరికా నిఘా సంస్థ కన్నేసింది. డెన్మార్క్ లోని కోపన్‌హెగన్‌లో ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నట్లు అతడిపై అనుమానాలు ఉన్నాయి. అప్పటికే హెడ్లీని తమకు అప్పగించాలని భారత్ అమెరికాను కోరుతోంది. ఆ తర్వాత కొన్ని నెలలకే రాణాను కూడా డెన్మార్క్ కుట్ర కేసులో అరెస్టు చేశారు. ఈ నేరం నిరూపితమైనా.. భారత్‌లో ముంబై దాడుల కుట్ర అభియోగాలు మాత్రం వీగిపోయాయి. ఈ విచారణ సందర్భంగా తనను హెడ్లీ ఇందులోకి లాగాడని రాణా చెప్పాడు. డెన్మార్క్ కుట్ర కేసులో రాణాకు వ్యతిరేకంగా హెడ్లీ కూడా సాక్ష్యం చెప్పడంతో ఈ కేసులో రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతడు 2020 కొవిడ్ సమయంలో విడుదలయ్యాడు. ఆ మర్నాడే అతడిని అరెస్టు చేయడానికి ‘పరస్పర నేరగాళ్ల అప్పగింత ఒప్పందం’ మేరకు భారత్, అమెరికా వారెంటు కోరింది. దాదాపు ఐదేళ్లపాటు వివిధ దశల్లో జరిపిన న్యాయపోరాటం తర్వాత అతడు విచారణను ఎదుర్కోవడానికి భారత్‌కు తీసుకొచ్చారు.
మొత్తంగా ఎన్‌ఐఎ చేసిన కృషి సాహససోపేత మైనదని చెప్పాలి. ఇది ఓ రకంగా అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను పెంచేదే. రాణా నోరు విప్పితేనే విషయాలు, వివరాలు బయటకు వస్తాయి. అప్పుడే భారత్ కు అసలైన విజయం దక్కుతుంది.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం!

