భారత అండర్ 19 మహిళల క్రికెట్ జట్టు ఆటగాడు గొంగడి త్రిష అద్భుత ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించారు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిష కేవలం 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ విజయంతో ఆమె అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు.
తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష 2005 డిసెంబర్ 15న జన్మించారు. చిన్న వయస్సులోనే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న త్రిష, మూడో తరగతి నుంచే ఆటను అభ్యసించడం ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆమె కోచ్ వద్ద మెళకువలు నేర్చుకుని ప్రతిభను ప్రదర్శించారు.
త్రిష కెరీర్ ప్రారంభంలోనే ప్రతిభ చూపించి అండర్ 16 జట్టులో చోటు సంపాదించడమే కాకుండా, ఆ సమయంలో ఉమెన్ ఆఫ్ ది సిరీస్‌గా గుర్తింపు పొందారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 8 ఏళ్లు. త్రిష 12 ఏళ్ల వయస్సులో అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించడం మరో గొప్ప ఘట్టం.
జైపూర్‌లో నిర్వహించిన అండర్ 19 మహిళల వన్ డే ఛాలెంజర్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన త్రిష, 112 పరుగులు చేసి తన ప్రతిభను మళ్లీ నిరూపించారు. ఇప్పుడు వరల్డ్ కప్‌లోనూ తన అసాధారణ ఆటతీరుతో అందరి మనసు గెలుచుకున్నారు.

