మీడిల్ ఈస్ట్ దేశమైన సూడాన్‌లో నార్త్ డర్ఫర్ రీజియన్‌లోని ఎల్-ఫాషర్ ప్రాంతంలో విషాదకర ఘటన జరిగింది. పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) చేపట్టిన డ్రోన్ దాడిలో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే, ఈ దాడిలో పదుల సంఖ్యలో రోగులు తీవ్రంగా గాయపడ్డారు.
సూడాన్ ఆరోగ్య శాఖ ఈ దాడిని ‘ఊచకోత’గా అభివర్ణించింది. ఈ ఘటనకు ముందు ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు సూడాన్ సైన్యానికి డర్ఫర్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించినట్లు సమాచారం. సైన్యం స్పందించకపోవడంతో ఈ దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
ఈ దాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఇరు వర్గాల అధికారులను శాంతి పాటించాలని, సామాన్య ప్రజలను హింసించరాదని హెచ్చరించింది. “ఎల్-ఫాషర్ ప్రజలు ఇప్పటికే అన్నీ కోల్పోయారు. అలాంటి వారిపై డ్రోన్ దాడి చేయడం అమానుషం” అంటూ మండిపడింది.
(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఎల్-ఫాషర్‌లో ఉన్న ఒకే ఒక్క ఆసుపత్రి ఇది. దాన్ని కూడా పేల్చేశారు. రోగులతో పాటు మా వైద్యులను కూడా చంపేశారు. ఇలాంటి ఘటనలు దారుణం” అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. సూడాన్‌లో మళ్లీ ఆరోగ్య సేవలను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.
సూడాన్‌లో గత ఏడాది ఏప్రిల్ నుంచి సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణ ప్రస్తుతం ఖార్టూమ్ దక్షిణ ప్రాంతమైన యార్మౌక్ వరకు విస్తరించింది. ఇలాంటి దాడులు సూడాన్‌లో పరిస్థితిని మరింత సంక్షోభంలోకి నెట్టాయని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

