దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్యాలెండర్ సంవత్సరం చివరి రోజున స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా సూచీలు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రోజంతా నష్టాల్లో కొనసాగినా, మధ్యాహ్నం సమయంలో కాస్త రికవరీ చేశాయి. సెన్సెక్స్ 109 పాయింట్ల నష్టంతో 78,139.01 వద్ద ముగియగా, నిఫ్టీ కేవలం 0.10 పాయింట్ల నష్టంతో 23,644.80 వద్ద స్థిరపడింది. ఐటీ మరియు కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ ఉదయం 77,982.57 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 77,560.79 కనిష్ఠ స్థాయిని తాకింది. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర 2626 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.65కు పడిపోయింది. సూచీల చివరి నిమిషం రికవరీ దేశీయ మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చినప్పటికీ, మొత్తం మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా ఉంది.

