మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సోమవారం సమావేశమయ్యారు. సత్య నాదెళ్ల నివాసంలో జరిగిన ఈ భేటీలో స్కిల్ యూనివర్శిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ రంగాల్లో సహకారంపై చర్చించారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో భాగస్వామ్యం సాధించే అవకాశాలను అన్వేషించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు హాజరయ్యారు. సత్య నాదెళ్ల హైదరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్‌తో జరుగుతున్న తొలి భేటీ ఇది. భవిష్యత్ టెక్నాలజీ అభివృద్ధిపై ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

