దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్‌కు చెందిన 7C2216 నంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొనడంతో మంటల్లో చిక్కుకుని పేలిపోయింది. ఈ ప్రమాదంలో 170 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు సిబ్బందిలో ఇద్దరిని మాత్రమే ప్రాణాలతో రక్షించగలిగారు.
అధికారుల ప్రకారం, విమానం ల్యాండింగ్ చేసేందుకు రెండు ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైంది. చివరిసారిగా ల్యాండింగ్ సమయంలో వేగాన్ని నియంత్రించడంలో వైఫల్యం ఏర్పడి రన్వే చివర్లో రక్షణ గోడను ఢీకొంది. ఈ దెబ్బతో ఇంధనం ఒక్కసారిగా మంటలు తీసుకుంది. విమానం పూర్తిగా కాలిపోవడంతో ప్రయాణికులను బయటకు తీసే అవకాశమే లేకుండా పోయింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ల్యాండింగ్ సమయంలో విమానం టైర్లు, ల్యాండింగ్ గియర్ పనిచేయకపోయాయని అధికారులు తెలిపారు. పైగా, ఏదైనా పక్షి ఢీకొనడం వల్ల ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం ల్యాండింగ్ యత్నించే సమయంలో ఇంజిన్ నుంచి నిప్పులు రావడం స్థానిక టెలివిజన్ ఛానల్స్‌లో ప్రసారమైంది.
ఈ ప్రమాదం సమయంలో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆరుగురు సిబ్బందిలో ఇద్దరిని మాత్రమే కాపాడగలిగారు. మిగతా ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారని యాంహాప్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఘటనా స్థలంలో విమానం పూర్తిగా ధ్వంసమైందని, మంటల కారణంగా శరీరాలను గుర్తించడం కూడా కష్టసాధ్యమవుతోందని అధికారులు తెలిపారు.
ఈ దారుణ ఘటనపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. విమానాశ్రయంలో అన్ని రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని, ఘటనకు సంబంధించిన వివరాలను త్వరితగతిన పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా, ఇంటీరియర్, ల్యాండ్ మినిస్టర్లతో పాటు పోలీసు, అగ్నిమాపక శాఖలను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తీవ్రంగా పరిశీలించాలని, బాధితుల కుటుంబాలకు తగిన సాయం అందించాలని మార్గదర్శకాలు జారీ చేశారు.
ఈ ఘటన కారణంగా ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం దీనిపై పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

