Tollywood|తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహమే గద్దర్ అవార్డులు
TELANGANA|తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రతిభావంతులను గౌరవించేందుకు తొలిసారి ఈ అవార్డులు ప్రకటించగా, సినిమా అభిమానుల్లో అద్భుతమైన స్పందన వ్యక్తమైందని అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్ ప్రముఖ నటి జయసుధ, ఎఫ్ఎసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారు 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాది ఉత్తమ చిత్రాలను గుర్తించి అవార్డులు ప్రకటించినట్లు వెల్లడించారు. 14 ఏళ్ల విరామం తర్వాత ప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలను మళ్లీ ప్రారంభించినట్టు దిల్ రాజు తెలిపారు.
ఈ గద్దర్ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వ్యక్తిగత విభాగాల్లో 1172 దరఖాస్తులు కాగా, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. నాటి ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఈ అవార్డులను పేరుపెట్టి, తెలంగాణ సాంస్కృతిక జీవన శైలికి అనుగుణంగా ప్రకటించిన విధానం ప్రశంసనీయమైందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
2024 గద్దర్ అవార్డుల విజేతల వివరాల్లోకి వెళితే, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుగా కల్కి 2898 AD సినిమాను ఎంపిక చేశారు. రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికయ్యాయి. ఉత్తమ బాలల చిత్రంగా 35 – చిన్న కథ కాదు గుర్తింపు పొందింది. దర్శకునిగా తన తొలి చిత్రంతో ఆకట్టుకున్న యదు వంశీకి (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు లభించింది.
నటన విభాగంలో, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు) గెలుపొందారు. దర్శక విభాగంలో నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD) ఉత్తమ దర్శకునిగా ఎంపికయ్యారు. సహాయ నటన విభాగంలో ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం), శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) ఉత్తమ సహాయ నటుడు, నటిగా నిలిచారు. సంగీత విభాగంలో భీమ్స్ సిసిరోలియో (రజాకార్), నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన), గాయని శ్రేయా ఘోషల్ (పుష్ప 2 – చూసేకి..) అవార్డులు అందుకున్నారు.
హాస్యనటులుగా సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2), బాలనటులుగా మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక గుర్తింపు పొందారు. ఉత్తమ కథారచయితగా శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి), ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయరచయితగా చంద్రబోస్ (రాజు యాదవ్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాథ్ రెడ్డి (గామి) అవార్డులు అందుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ గద్దర్ అవార్డులు రాష్ట్రంలో సినీ రంగానికి మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని సినీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.


