-KCR|కేసీఆర్ బదులు KAVITHA|కవిత
-NOTICE|నోటీసుల బదులు లేఖ|LETTER
-కాళేశ్వరం లీకేజీల బదులు లేఖ లీకేజీ
-అవినీతి కి బదులు కొత్త పార్టీ|NEW PARTY
-‘గీత’ గీసి కవిత రాత మార్చే ప్రయత్నమా?
-DAMAGE|డ్యామేజీ అయిన ఇమేజీని పెంచే యత్నమా?
కేసీఆర్ కి కన్నబిడ్డ కవిత లేఖ రాయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? రాసెను పో.. దాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వచ్చెను పో… ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? జరిగెను పో… కన్న కొడుకికి టైమ్ ఇచ్చిన కేసీఆర్, మరి కన్న బిడ్డ కవితకు టైమ్ ఇవ్వడం లేదా? అసలేం జరుగుతోంది?
కేసీఆర్ మీద జరగాల్సిన చర్చ కవిత మీద ఎందుకు జరుగుతోంది? కాళేశ్వరం మీద జరగాల్సిన రచ్చ కవిత రాసిన లేఖ లీకేజీ మీద ఎందుకు జరుగుతోంది? గు‘లాబీ’ వలలో మీడియా పడిందా? తప్పటడుగులు వేసిందెవరు? నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ చేతులు ముడుచుకుని కూర్చుంటే, ఆ తర్వాత పనిని గులాబీ బాస్ కానిచ్చేశారా? చర్చ జెండాను, రచ్చ ఎజెండాను డిసైడ్ చేసింది కేసీఆరేనా? నోటీసులకు విరుగుడుగా, పోటీగా దీటుగా లేఖ లీకు అస్త్రాన్ని సంధించి, తనపై జరగాల్సిన చర్చను తన బిడ్డ ఇమేజీని పెంచే ప్రక్రియవైపు మళ్ళించిన అత్యంత రాజకీయ నేర్పరి కేసీఆర్ గాక మరెవ్వరు? హాట్సాఫ్ కేసీఆర్ సార్!
కేసీఆర్ మీద జరగాల్సిన చర్చ కవిత మీద జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద జరగాల్సిన రచ్చ కవిత లెటర్ లీకేజీ మీద జరుగుతోంది. పైగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేసి, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించిన కవిత తన కార్యక్రమాలతో యమ బిజీగా ఉన్నారు. మీడియా మాత్రమే లీకేజీల మాయలో కొట్టుకుపోతున్నారు.
కేటీఆర్ కు ఎసీబీ ఇచ్చిన నోటీసులపై కవిత ఇన్ స్టా, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పందించారు. ‘తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది.’ అని పోస్టు చేశారు. ఇక అన్నా చెల్లెళ్ళకు, తండ్రీ బిడ్డలకు పంచాయతీ ఉన్నాట్లా? లేనట్లా?
తన బంధువులు, సడ్డకుల పిల్లలను కూడా చేరదీసి, ఆర్థికంగా ఆదుకుని, అందలాలు ఎక్కించి, పదవులు కట్టబెట్టిన కేసీఆర్, తన బిడ్డను గాలికి వదిలేస్తారా? తక్కువ చేస్తారా? ఆపద వస్తే ఆదుకోరా?
అంతకంటే కవితకు ఒక స్థానం కల్పించడం కోసం ఇదొక ఎత్తుగడా? లేఖ లీకేజీ, తదనంతర పరిణామాల ద్వారా కవిత విలువను పెంచే ప్రయత్నం జరుగుతుందా? జాగ్రుతి వంటి ఓ సంస్థ ద్వారానే తన కార్యకలాపాలు నడిపిన కవిత నిజామాబాద్ ఎంపీగా అప్పటి టిఆర్ఎస్ పార్టీ బీ ఫాంతోనే పోటీ చేసి రాజకీయాలను నెరిపారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉన్నారు.
ఒకవేళ రేపు కవిత సొంత కుంపటి పెట్టుకున్నా, ఇప్పుడు ఎన్నికలేవీ లేని టైమ్ లో కేసీఆరే ప్రోత్సహించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ తర్వాత కలిసిపోవడానికి, ప్రయాణించడానికి వాళ్ళ ఫ్యామిలీ పార్టీలో అడ్డంకులు వాళ్ళకెందుకు ఉంటాయి?
తన చుట్టూతా తిరగాల్సిన రాజకీయాలను తనకు ఎంతో ఇష్టమైన బిడ్డ కవిత చుట్టూతా తిప్పుతున్నారా? లిక్కర్ కేసుతో డ్యామేజీ అయిన ఇమేజీని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారా?
తండ్రి కేసీఆర్ కి, బిడ్డ కవిత లేఖ రాశారు. ఆ తండ్రీ బిడ్డల మధ్య కలవలేనంత ఎడం ఉందా? వాళ్ళు అంత దూరంలో ఉన్నారా? కవిత ఉండేది హైదరాబాద్ లోనే, కేసీఆర్ ఉండేది ఎర్రవెల్లి లనే కదా? సీఎంగా మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, నాయకులకు, కార్యకర్తలకు, చివరకు ఉద్యమకారులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్, తన కన్న కొడుకు బిడ్డలకు కూడా ఇవ్వడం లేదనుకోవాలా?
ఈ పరిణామాలను పరిశీలిస్తే… కాళేశ్వరం ప్రాజెక్టు పై నియమితమైన జస్టిస్ ఘోష్ కమిషన్ మే 20న నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9న ఈటల రాజేందర్ ను హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం నిర్మాణం సమయంలో కేసీఆర్ సీఎంగా, హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. 23వ తేదీన కవిత లేఖ లీకైనట్లు, అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత నేరుగా విమానాశ్రయం నుంచే మీడియాతో మాట్లాడారు. ఆతర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచిత్రమేంటంటే… రాజకీయ పరిణతిని అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ పెద్దగా ప్రదర్శించలేపోవడం. ప్రదర్శించిన దానిని కొనసాగించలేకపోడం. దీంతో జరగాల్సిన చర్చ, రచ్చ పక్కదారి పట్టడం. తాత్పర్యం ఏంటంటే… దేశమైనా, రాష్ట్రమైనా వాటి పురోగతి రాజకీయ పునాది, సంకల్పం మీదే ఆధారపడతాయి. ఇప్పుడు అవి ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలిసి వస్తున్నాయని అనుకోవచ్చా?

