వరంగల్ సభ సక్సెస్!
ఎల్కతుర్తి సభ ఎన్నికల ప్రచారాన్ని తలపించిందా?
ఆకట్టుకున్న గులాబీ బాస్ ‘పవర్ – ఫుల్’ స్పీచ్
‘ఆపరేషన్ కగార్’ తీర్మానం అన్నల సానుభూతినిచ్చేనా?
భూముల అమ్మకంపై వ్యాఖ్యలు ‘సమర్థింపేనా’?
దున్నపోతుకు గడ్డేసి బర్రెను పాలీయమంటే ఎలా?
కత్తి వాళ్ళ చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేమంటే ఎలా?
25 ఏండ్ల క్రితమే సభలతో, సమావేశాలతో, జనాలని విపరీతంగా ఆకర్షించారు. తన తెలంగాణ మాండలిక మాటల తూటాలతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ధూం దాం గా సభలను సక్సెస్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకా తమలో వాగ్ధాటి తగ్గలేదని నిరూపిస్తూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న టీఆర్ఎస్ @ బీఆర్ఎస్ 25 వార్షికోత్సవ రజతోత్సవ సభ విజయవంతంగా ముగిసింది. కేసీఆర్ ప్రసంగం యథావిధిగా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఎల్కతుర్తి సభ ఎన్నికలను తలపించింది. 2023 ఎన్నికల ఆఖరి ప్రచార సభకు మించి సాగిన కేసీఆర్ ప్రసంగం ఆయన అభిమానులను ఉత్సాహ పరిస్తే, పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచింది. ఇప్పటి దాకా కన్ఫ్యూజన్ గా ఉన్న అనేక అంశాలపై ప్రజలకు క్లారిటీని కూడా ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఫెల్యూర్స్, కాంగ్రెస్ ను నమ్మి గల్లంతైన ప్రజలు, తన కళ్ళముందే జరుగుతున్న తతంగాలు ఆయన మనసునెంతగా బాధపెడుతున్నాయో ప్రజలకు తెలిసి వచ్చింది. ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయడానికి తీర్మానించడం అందరినీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేమెందుకు పడగొడతాం. ప్రజలే చూసుకుంటారన్న వ్యాఖ్యలు పాపం సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన సర్కార్ ని కూడా కొంచెం నిమ్మళం చేసి ఉంటాయి. రెండున్నరేళ్లే ఉంది ఇక ప్రజల కోసం తానే బయలుదేరుతానని కేసీఆర్ ఇచ్చిన భరోసా పెద్ద మార్పు. తను మారారా? లేక జనమే మారాలని చెప్పారా?! మొత్తానికి ‘ మార్పు ‘ మార్గంలో సాగిన కేసీఆర్ పవర్ ఫుల్ ప్రసంగం ఆయన ఆశించిన పవర్ మార్పునకు ఏ మేరకు దోహదం చేస్తుందో చూడాలి.
బీఆర్ఎస్ అవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎల్కతుర్తి సభ సక్సెస్ అయింది. లక్షలాది మంది హాజరైన ఈ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కాకపోతే ఆయన ప్రసంగం విపక్షంలో ఉన్నట్లుగా గాక, ఇంకా అధికారంలో ఉన్నట్లుగానే సాగింది. బహుషా ఆయనకు సభలపై, ప్రసంగాలపై, ఇంతకాలంగా నిర్వహించిన పదవులపై ఉన్న సాధికారత కారణంగా ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు. లేక మనకు అలా అనిపించి కూడా ఉండవచ్చు. అప్పుడు చేపట్టాం, చేస్తున్నామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేశామని చెప్పారు. అనేక అంశాలపై విష్పష్టంగా మాట్లాడారు. తాను మారానని, మార్పు అనివార్యమైని, ఆ మార్పు ప్రజల్లో కూడా రావాలని, అప్పుడే ప్రభుత్వం కూడా మారుతుందని ఆయన నమ్మడమే కాదు. అంతే నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో కల్పించారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ‘అడుగు’ పాఠకుల కోసం.
‘నా కళ్ళముందే ఇదంతా జరుగుతుందనుకోలేదు. నా మనసుకు ఎంతో బాధైతాంది. దు:ఖం అయితాంది. అని బాధపడిన మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలె?’ అంటూ తెలంగాణ ప్రజలకు కర్తవ్యాన్ని గుర్తు చేశారు.
తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్
‘ ఆరు చందమామలు పెడ్తం. ఏడు సూర్యుళ్ళు పెడ్తమని నమ్మబలికి, ప్రజల్నిదగా చేసి, మంచిగున్న తెలంగాణను ఆగం చేసిండ్లు.’ అంటూ కాంగ్రెస్ కు చురకలు వేశారు. ఇప్పుడేమో మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు. అప్పు పుడతలేదని, ఏడి నుంచి తెచ్చియ్యాలని మాట్లాడుతున్నరు. ఇంత దగాఉంటదా? ఓట్లు వేసుకుని ఇలా చేస్తారా? కాంగ్రెస్ ను చూస్తుంటే మనసు బాధపడ్డారు.
ప్రజలపై మరోసారి నిందారోపణలు
‘కాంగ్రెస్ వాళ్ళు మా అంత సిపాయిలు లేరని చెబితే జనం నమ్మిండ్లు. బోల్తా పడ్డరు. గల్లంతైండ్లు.’ అంటూ మరోసారి తమకు ఓట్లు వేయని, కాంగ్రెస్ ను ఎన్నుకున్న ప్రజల్నే నిందించారు. ఇది ఏ మేరకు మార్పు? మార్పు గులాబీ బాస్ లో వచ్చినట్లేనా? ఇది ఆలోచించి, విశ్లేషించాల్సిన అంశం.
విలన్ కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ ఫెయిల్
‘ అప్పుడూ ఇప్పుడు తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెసే. అని చెప్పి… అన్నింట్లో కాంగ్రెస్ ఫెయిల్.. ఫెయిల్.. ఫెయిల్’ అంటూ ప్రజల చేతే చెప్పించి.. కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్న విషయాన్ని ప్రజల మనసుల్లో బ్రహ్మాండంగా నాటగలిగారు.
అన్నల సానుభూతి దక్కేనా?
‘ఆపరేషన్ కగార్ ‘ పై కేసీఆర్ సభలో తీర్మానం చేయించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలి. గిరిజనుల ఊచకోత తగదు. నక్సలైట్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. చేతిలో మిలటరీ ఉందని నరికిపారేస్తామంటే ఎలా?’ అంటూ నిలదీశారు. ఇది కేసీఆర్ వైఖరికి పూర్తిగా భిన్నమైన తీర్మానం. అయితే, దీని ద్వారా కేసీఆర్ ఆశించిన విధంగా అన్నల సానుభూతి దక్కుతుందా? చూడాలి.
పోలీసులకు రాజకీయాలెందుకు?
‘పోలీసులు బీఆర్ఎస్ వారిని వేధిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళ వివరాలు డైరీల్లో రాసుకుంటున్నాం. మీ సంగతి తేలుస్తాం. పోలీసులు రాజకీయాలు మానుకోండి. డ్యూటీ మాత్రమే చేయండని’ చెప్పడం ద్వారా వారికి హెచ్చరికలు జారీ చేశారు.
బీజేపీపై విసుర్లు
’11 ఏళ్ళల్లో రాష్ట్రానికి బీజేపీ 11 రూపాయలైనా ఇచ్చిందా?’ అంటూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వైఖరిని ఎండగట్టారు. తద్వారా కాంగ్రెస్ నే కాకుండా బీజేపీని సైతం విమర్శించినట్లయింది. కాంగ్రెస్ మాత్రమే కాదు బీజేపీ కూడా తెలంగాణకు శ్రత్రువేనని, ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే దిక్కని చాటినట్లయింది.
భూములు అమ్మకం తప్పా? ఒప్పా?
‘భూములు అమ్మడం తప్పుకాదు… అవసరాన్ని బట్టే అమ్మాలి’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మొదటిసారిగా స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్ధించారా? లేక వ్యతిరేకించారా? లేక సూచించారా? తేల్చుకోండి అని అది ప్రజలకే వదిలేశారు.
ప్రభుత్వాన్ని మేమెందుకు పడగొడతాం?
‘అలాంటి కిరికిరి పనులు మేం చేయబోం. ప్రజలు మీకు ఓటేశారు. ఆశించిన విధంగా పని చేయకపోతే వారే మీ వీపులు సాపు చేస్తారు.’ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కాలం మూడు నెలలే. ఆరు నెలలే. ఎంతో కాలం నిలవదు. ఈ సీఎంని దింపేస్తాం. కాంగ్రెసే రేవంత్ ని మార్చేస్తుంది. అధికారం మనదే. అంటూ అదే పనిగా చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా సభలో వినిపించిన మాటలివి. మాట మాత్రమే మారిందా? గొంతు సవరించుకున్నట్లేనా?
అసెంబ్లీకి వెళ్ళాలా?
‘అసెంబ్లీకి రా రామ్మంటున్నరు. అక్కడికి పోయి ఏం చేయాలె. ఆ పిల్లకాయలు మాట్లాడుతుంటే వినాలా? మా పిల్లలు పోతుండ్రు’. అంటూ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీపై పదేండ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్ వైఖరికి నిదర్శనం. అయితే, అనేక విధాలుగా మారినట్లు కనిపిస్తున్న కేసీఆర్, తనను ఎన్నుకున్న ప్రజల కోసమో, తాను కావాలనుకుంటున్న ‘పవర్’ కోసమో కేసీఆర్ చట్టసభలను గౌరవిస్తే బాగుండని అనిపిస్తుంది. అది జరగాలని పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటున్నాయి.
దున్నపోతుకు గడ్డేసి.. బర్రెను పాలివ్వమంటే ఎలా?
ఇదైతే ప్రజల తప్పే. దీన్ని సవరించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదే. కికాంగ్రెస్ ను గెలిపించి, బీఆర్ఎస్ ను అడిగితే ఏం లాభం? అందుకే కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానించి ఉంటారు.
కత్తిని వాళ్ళచేతికిచ్చి…నన్ను యుద్ధం చేయమంటే ఎలా?
‘ కాంగ్రెస్ చేతిల తెలంగాణ ఖతమైతాంది. ఇండ్లు కూల్చబట్టిరి. మీరైనా వచ్చి ఆపాలెసార్ అని ఒకాయన ఫోన్ చేసి అడుగుతాండు. గిట్ల ఎట్లయితది? కత్తిని వాళ్ళచేతికిచ్చి… నన్ను యుద్ధం చేయమంటే ఎలా? అని కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తుతించారు. నిజమే కదా?
ఇక నేనే బయలుదేరుతా
‘ కాంగ్రెస్ కు ఉన్నది రెండున్నరేళ్ళే…మళ్ళీ సర్కార్ బీఆర్ఎస్ దే
నన్ను ఎవరూ ఆపలేరు… ఆపడం ఎవరి తరమూ కాదు. ఇక నేనే బయలుదేరుతా.. .అన్ని లెక్కలు తేలుస్తా’ అంటూ కేసీఆర్ ప్రజలకు, పార్టీ శ్రేణులకు తానున్నాననే భరోసానిచ్చారు.
తగ్గిందేలే! అదే చిరాకు… అదే పరాకు
కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వేదిక ముందు నుంచి సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో కాస్త చిరాకు పడ్డారు. వీళ్లు మన కార్యకర్తలేనా? అంటూ గోపగించుకున్నారు.
ఎత్తుగడ అదిరింది
కాంగ్రెస్ పై విమర్శలే తప్ప ఎక్కడా సీఎం రేవంత్ పేరు రాకుండా తన ప్రసంగాన్ని కేసీఆర్ ముగించారు.
మార్పు మంచిదే
బి ఆర్ ఎస్ బాస్ చెబుతున్నట్లు ప్రజలు కాంగ్రెస్ కు పొరపాటుగానే ఓట్లు వేసి ఉంటారా?! కాంగ్రెస్ కు వేసిన ప్రజలే వాళ్ళంతట వాళ్లు రేపు బి ఆర్ ఎస్ కు వేయాలా? అందుకు బి ఆర్ ఎస్ చేయాల్సిందేమి లేదా? అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత బి ఆర్ ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లేనా!? ప్రజలకు తాము తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే ధైర్యాన్ని పరోక్షంగా తన శ్రేణులకు చెప్పరా? ఇవన్నీ లోతుగా పరిశీలిస్తే.. మరి కేసీఆర్ మాటల్లో క(వి)నిపిస్తున్న మార్పు చేతల్లో వచ్చిందా? వస్తుందా? గులాబీ బాస్ లో వచ్చిన ఈ మార్పు, ఆయన ఆశిస్తున్న ‘అధికార మార్పు’నకు దారి తీస్తుందా? చూడాలి. ఇక ఇప్పుడు పార్టీలు కాదు. నాయకులు కాదు. ప్రజలే తేల్చుకోవాలి.
బీఆర్ఎస్ ప్రస్థానానికి ఆ ఇద్దరే స్ఫూర్తి – KTR

‘కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య జయశంకర్ లే బీఆర్ఎస్ కు స్ఫూర్తి’ అంటూ గులాబీ చిన్న బాస్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు జయంతి, వర్ధంతి వంటి తత్ దినాలకే పరిమితం చేసిన వారిని తిరిగి గుర్తు చేయడం ద్వారా తాము ఉద్యమ స్ఫూర్తిని మరువలేదని తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారి మానసపత్రిక జల ద్రుశ్యం నుంచి జన ద్రుశ్యం దాకా అంటూ ఓ శీర్షికను పెట్టుకునే అవకాశం కల్పించారు.

