‘అడుగు’ ఎఫెక్ట్!
పాలకుర్తి హై స్కూల్ కి రూ.30 లక్షల ‘అమ్మ’ నిధి
చొరవతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్వినీ సన్నిధి
మంజూరు చేసిన కలెక్టరే విద్యార్థుల పాలిట పెన్నిధి
‘అడుగు’కు వెల్లువెత్తుతున్న అభినందనలు
అవును. పాలకుర్తి హై స్కూల్ పక్షాన ‘అడుగు’ నిలిచింది. ‘బడి’ని ‘బార్’ గా మార్చిన ఆకతాయిలను, అసాంఘిక వ్యక్తులను నిలదీసింది. సమస్యలను ఏలికలు, పాలకుల ద్రుష్టికి తీసుకెళ్ళింది. అడుగు కథనాలకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ లు స్పందించారు. పాఠశాల సమస్యలను, విద్యార్థుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకున్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి తమ సహానుభూతిని చాటుకున్నారు. శంకుస్థాపన చేసి సోమవారం పనులను కూడా ప్రారంభించారు. దీంతో ‘అడుగు’ నిలిచింది. 45 రోజుల్లోనే ‘బడి’ గెలిచిందంటూ సర్వత్రా ‘అడుగు’పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
జనగామ జిల్లా పాలకుర్తి హై స్కూల్ దుస్థితిపై ‘అడుగు’ లో వచ్చిన కథనాలకు పాలక, అధికార యంత్రాంగం కదలింది. వెంటనే నిధులు మంజూరు చేసింది. పనులను కూడా ఎమ్మెల్యే శయస్వినీ రెడ్డి సోమవారం ప్రారంభించారు. పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ పై ‘అడుగు’ లో అనేక వరస కథనాలు వచ్చాయి. ఈ ఏడాది మార్చి 4వ తేదీన ‘‘పగలు ‘సాగు’ బడి!, రాత్రి ‘తాగు’ బడి!!,’’ మార్చి 5వ తేదీన ‘‘ఇదేం ఏలు ‘బడి’! నైట్ వాచ్ మన్ లేరు, స్వీపర్లు ఊడ్చేయరు, పంతుళ్ళు పట్టించుకోరు, రెండేళ్ళ కిందే గేట్లు తీసేశారు. పెట్టిన రెండు నెలలకే డిగ్రీ కాలేజీని ఎత్తేశారు. నాంచారు మడూరుకు మార్చేశారు. ఖాళీగా గ్రౌండ్ లో కట్టిన కొత్త భవనాలు. గ్రౌండ్ లో లేని సిసి కెమెరాలు, ‘బడి’నే ‘బార్’ గా మార్చిన మందు బాబులు. ఆకతాయిలకు అడ్డాగా బడి. అనే శీర్షికలు, ఉప శీర్షికలతో వచ్చిన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. ఎమ్మెల్యే సైతం వెంటనే స్పదించి కలెక్టర్ తో మాట్లాడారు. ఈ వార్తా కథనాలకు అప్పుడే స్పందించిన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పదో తరగతి పరీక్షల సన్నాహక సమావేశంలో స్వయంగా కల్పించుకుని, హెడ్ మాస్టర్ తో మాట్లాడి, వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకం కింద నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అంచనాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కూడా ‘అడుగు’ మార్చి 6వే తేదీన ‘‘ఏలు ‘బడి’! కథనాలతో కదిలిన అధికార యంత్రాంగం, ఎంఇఓలు, హెచ్ఎంల మీటింగులో అడుగు కథనాలను ప్రస్థావించిన కలెక్టర్. హెచ్ఎంను అడిగి మరీ నిధులుచ్చిన జిల్లా ఉన్నతాధికారి. పాలకుర్తి బడికి టాయిలెట్లు, గేట్లు, ప్రహారీ గోడ సీసీ కెమెరాలు’’ కూడా అంటూ… అలాగే, ఎంఇఓ సందర్శనం, స్కూల్ ఆవరణ పరిశుభ్రం.. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు. అమ్మ అదర్శ పాఠశాల నిధులతో వెంటనే ఏర్పాటుకు ఆదేశాలు. ‘అడుగు’కు అభినందనల వెల్లువ…’’పై కూడా వార్తా కథనాలను ‘అడుగు’ ప్రచురించింది. అలాగే ‘‘మరి స్వీపర్లు, నైట్ వాచ్ మన్ ల సంగతేంటి?’’ అంటూ ‘అడుగు’ ప్రశ్నించింది. ఈ వరుస కథనాలతో స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే శయశ్వినీ, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలన్న విషయమై కూడా అడుగు కథనాలను రాసిన విషయాలన్నీ పాఠకులకు విధితమే.
పాలకుర్తి హై స్కూల్ కు రూ.30 లక్షలు మంజూరు
అయితే, అటు ఎమ్మెల్యే, ఇటు జిల్లా కలెక్టర్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ, పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ కు నిధులు మంజూరు చేశారు. అంసంపూర్తిగా ఉన్న ప్రహారీ గోడలు, గేట్లు, టాయిలెట్ల మరమ్మతులు, కొత్తగా మరికొన్ని టాయిలెట్లు వగైరాల కోసం మొత్తం రూ.30లక్షలు మంజూరు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వు (ఆర్.సి నెంబర్ 464/B2/SSAAPC/2025) లు జారీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఎఎపిసి) కింద జనగామ జిల్లాలోని 15 స్కూల్స్ కి 78.883 లక్షల రూపాయలు మంజూరు కాగా, అందులో 30.065 లక్షల రూపాయలు పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ కే కేటాయించడం విశేషం.
పాలకుర్తి హై స్కూల్ కి మైనర్ రిపేర్స్ కింద మూడు యూనిట్లకు రూ.6.70 లక్షలు, ఉపయోగించలేని విధంగా ఉన్న ఒక బాయ్స్, ఒక గాల్స్ టాయిలెట్స్ మరమ్మతుల కోసం ఒక్కో యూనిట్ కు రూ.35వేల చొప్పున మూడు యూనిట్లకు రూ.లక్షా 6వేల 500లు, అలాగే కొత్తగా నిర్మించనున్న 6 కొత్త టాయిలెట్స్ కోసం ఒక్కో యూనిట్ కు రూ.లక్షా 50వేల చొప్పున మొత్తం రూ.22 లక్షల 30వేలను మంజూరు చేశారు. కాగా, ప్రహారీ గోడ, టాయిలెట్స్ కు కలిపి మొత్తం రూ.30లక్షల 6వేల 500 మంజూరయ్యాయి.
పాఠశాల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఈ నిధులతో చేపట్టాల్సిన పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. పనులు వెంటనే ప్రారంభించి, సాధ్యమైనంత తొందరలోనే వాటిని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
‘అడుగు’కు అభినందనల వెల్లువ
దీంతో మరోసారి ‘అడుగు’కు అభినందనలు వెల్లువెత్తాయి. ఒక సామాజిక సమస్యపై అందునా ఎంతో విలువైన విద్యాబోధనకు సంబంధించిన పాఠశాల వసతుల విషయమై సమస్యలను ఎలుగెత్తడమేకాకుండా, వాటి పరిష్కారానికి ధైర్యంగా వరస కథనాలు రాసి, అండగా నిలవడం, అవి పరిష్కారమయ్యే దాకా వెరువక, వెనుదిరగక వెంటపడటాన్ని పలువురు అభినందిస్తున్నారు. అంతేకాదు ఆయా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం, అందుకనుగుణంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ స్పందించడం, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నిధులు మంజూరు చేయడం, ఆ పనులను వెంటనే ప్రారంభించి, పూర్తి చేసే విధంగా ఎమ్మల్యే శంకుస్థాపన పూర్తి చేయడం వరకు ‘అడుగు’ ఆ పాఠశాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి, నిబద్ధతతో నిలబడినందుకు పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రత్యేకించి ఎమ్మెల్యే యశస్వినీ ప్రజల పక్షాన వేస్తున్న ‘అడుగు’ కథనాలను అభినందించారు. అలాగే ‘అడుగు’ కథనాల వల్లే పాఠశాలకు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందని, సదుపాయాలు సమకూరుతున్నాయని పాలకుర్తి హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి క్రుతజ్నతలు, ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, పాలకుర్తి ప్రముఖులు సైతం ‘అడుగు’ను అభినందించారు.

