భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ భరోసానిచ్చారు. కేసీఆర్ గారికి, పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉండి, వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను చేపడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ చిన్న అవసరమైనా నేరుగా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం తాను వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం బీఆర్ఎస్ కార్యకర్తల ప్రథమ కర్తవ్యం అని, కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్‌పైనే ఉందని చెప్పారు.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా ఒక్క నిర్ణయం కూడా ప్రయోజనకరం కాలేదని విమర్శించారు. “ఆత్మీయ భరోసా” పేరుతో పేదలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్, డబ్బులు ఇవ్వకుండా ప్రజల నమ్మకాన్ని వంచించిందని అన్నారు. “మన కళ్లముందే తెలంగాణ ఆగిపోతుంటే చూస్తూ ఊరుకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది” అంటూ ఆమె పిలుపునిచ్చారు. అప్పులపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, 2004లో అస్తిత్వమే లేని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను ఏడిపించి, చివరకు వందలాది మంది యువకులను కోల్పోయిన తర్వాతే తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. ఈ రోజు లక్షా 60 వేల కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని, తెచ్చిన అప్పును ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. రూ. 40 వేల కోట్ల విలువైన భూములను కేవలం రూ. 10 వేల కోట్లకే తాకట్టు పెట్టిన ప్రభుత్వాన్ని నిలదీయాలని, రైతు భరోసా, రుణమాఫీ పేరుతో చేసిన ప్రకటనలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. 60 శాతం రైతులకు రుణమాఫీ రాకపోగా, 50 శాతం మందికి రైతు భరోసా అందలేదని అన్నారు. మరి ఈ రూ.10 వేల కోట్లు ఎక్కడికి పోయాయో ప్రభుత్వం చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు బయటకు తెలంగాణ వ్యక్తుల్లా కనిపించినా, వారి చర్యలు తెలంగాణ వ్యతిరేకంగానే ఉన్నాయని ఆరోపించారు. 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలే ఇచ్చిందని విమర్శించారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టిన ఘనత పూర్తిగా కేసీఆర్‌దేనని, ఆయన ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా పని చేశారని కొనియాడారు.
సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత కూడా కేసీఆర్‌కే చెందుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి శ్రీరామరక్ష లాంటి బీఆర్ఎస్ పార్టీ అవసరమని, ఈ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిందని గుర్తు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ పార్టీలోకి మారిన డబ్బా నాయకుడిగా పేర్కొంటూ, ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
ద్రోహులు, కుట్రలు కనిపించాయి, ఎదురయ్యాయి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ మోసం చేస్తుందని కేసీఆర్ పదే పదే చెప్పారని, మోసం చేయడం కాంగ్రెస్ స్వభావమని తేల్చిచెప్పారు.

