-ఎమ్మెల్యే యశస్విని
మా విషయంలో చిల్లర ప్రచారాలు మానుకో – మా కుటుంబ విషయాలు నీకెందుకు
విరుచుకుపడ్డ ఝాన్సీ రెడ్డి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఝాన్సీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.450 కోట్లు నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. పాలకుర్తిలోని 50 పడకల ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, రాయపర్తిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామని చెప్పారు. పెద్దవంగరలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండటం వల్ల, వాటికి స్వంత భవనాల నిర్మాణంకు త్వరలో శంకుస్థాపన చేస్తామని వివరించారు.తమ పాలనలో చేస్తున్న అభివృద్ధిని చూసే రోజులు త్వరలోనే వస్తాయని చెబుతూ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. “ఇన్ని రోజులు ఏం అభివృద్ధి చేశావో చెప్పాల్సిన అవసరం లేదు, నేను అభివృద్ధి చేసి చూపిస్తా,” అంటూ విరుచుకుపడ్డారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను తన హయంలోనే పూర్తిచేస్తానని తెలిపారు. పైగా, రిజర్వాయర్ అంశంపై మరోసారి చర్చకు సిద్ధంగా ఉన్నానని, దయాకర్ రావు సిద్ధంగా ఉంటే ముందుకురావాలని సవాల్ విసిరారు.తన నియోజకవర్గ అభివృద్ధే తన కర్తవ్యం అని స్పష్టం చేసిన ఆమె, “మా కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊరిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది,” అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక, పాలకుర్తి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సన్న బియ్యం విషయంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని వెల్లడించారు. “పార్టీ కాదు, అర్హతతోనే ప్రజలు ఎన్నుకుంటారు,” అని స్పష్టం చేశారు.

ఇక నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ, “బిడ్డా కాస్కో ఇక…” అంటూ… ఎర్రబెల్లి నోట్లపై ఉన్న మమకారంతో బంధాల విలువ మరచిపోయాడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంత సంపాదించారని ప్రశ్నించారు. డబ్బు, అధికారం వ్యాపారం కాదని, తాము సమాజ సేవ కోసమే ఉన్నామని స్పష్టం చేశారు. “నీ అంతు చూస్తా, నీ చెంచాల సంగతి చూస్తా” అంటూ హెచ్చరికలు చేస్తూ, మాట జాగ్రత్తగా వాడుకోవాలని, అన్యాయాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ భూముల కబ్జాలు, నియోజకవర్గ అభివృద్ధిపై ఎర్రబెల్లి చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, అతని కోవర్టుల విషయాలు కూడా తెలిసినవేనని అన్నారు. “అమావాస్య, పౌర్ణమి ఒకటే కాదని గుర్తుపెట్టుకో” అంటూ తీవ్రంగా స్పందించారు. ప్రజల తీర్పే తుదితీర్పు అని, వారి కుటుంబాల్లో మేము సభ్యులం అని వినమ్రతతో చెప్పినప్పటికీ, ఇక ఉపేక్షించేది లేదని, రోజుల లెక్క పెట్టుకో… అంటూ.. హెచ్చరించారు. ఎర్రబెల్లి ఊసరవెల్లి పోకడలు మానుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకే ఏడాదిలో బీఆర్‌ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. పాలకుర్తిలో ప్రజలకు స్వతంత్రం వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించడం ఖాయమని చెప్పారు. “దయాకర్ రావు, నిన్ను మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిస్తాం,” అంటూ స్పష్టంగా హెచ్చరించారు. ఆయన పాలకుర్తిలో దోచుకొని, ఆస్తులను అమెరికాలో దాచి పెట్టాడని ఆరోపించారు. . “నువ్వు తయారు చేసిన కోవర్టుల అంతు చూస్తాం. నీవు వేసిన పావులా పనిచేస్తున్న వారినీ వదిలిపెట్టం,” అంటూ హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

