భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. అంబేద్కర్ అణగారిన వర్గాల సంక్షేమానికి చేసిన పోరాటాన్ని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారత కోసం ఆయన అవిశ్రాంతంగా కృషిచేసిన దిశగా సీఎం పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును ఊహిస్తూ దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని తెలిపారు. ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనకు రాజ్యాంగమే మార్గం అయ్యిందని గుర్తుచేశారు. దళిత అభ్యున్నతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడినట్టు చెప్పారు. నాలెడ్జ్ సెంటర్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, రాజీవ్ యువశక్తి పథకం ద్వారా అట్టడుగు వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు.

