– రేణక్క అంతిమ యాత్రకు ఏర్పాట్లు పూర్తి
– కుటుంబసభ్యులకు సంతాపం, భారీగా తరలివస్తున్న అభిమానులు
జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన మావోయిస్టు నేత గుమ్మడివెల్లి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దమయంతి ఇటీవల ఛత్తీస్‌గఢ్, దంతెవాడ దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున ఆమె మృతదేహం స్వగ్రామమైన కడవెండికి చేరుకోగా, ముందుగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం ఆమె అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు వారి సోదరుడు తెలిపారు. రేణుకను చివరిసారి చూసేందుకు ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్థులు, అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆమె పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి, అమర్ రహే రేణక్క అంటూ నినాదాలు ఇస్తున్నారు.
మావోయిస్ట్ అగ్ర నేత రేణుకపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. 25 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ. 20 లక్షలు కలిపి మొత్తం రూ. 45 లక్షల రివార్డ్ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో నెల్గోడ, ఇకెలి, బెల్నార్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆమె నక్సల్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు సెంట్రల్ రీజినల్ బ్యూరో (CRB) ప్రెస్ టీం ఇన్‌చార్జ్‌గా వ్యవహరించేది. “ఎడిటర్ ప్రభాత్ పత్రిక” (DKSZCM) ప్రచురణకు ఆమె బాధ్యత వహించేది.
1996లో నక్సల్ సంస్థలో చేరిన రేణుక, ఆంధ్రప్రదేశ్‌లో SZCM కృష్ణ అన్నతో కలిసి పనిచేసింది. 2003లో డివిజనల్ కమిటీ మెంబర్ (DVCM)గా పదోన్నతి పొందింది. 2006లో సౌత్ బస్తర్ ప్రాంతంలో CCM దుల్లా దాదా అలియాస్ ఆనంద్‌తో కలిసి పనిచేసింది. 2013లో మాడ్ ప్రాంతానికి మారి SZCM రామన్నతో కలిసి పనిచేసింది. 2020లో కరోనా కారణంగా రామన్న మరణించడంతో, రేణుకను DKSZCM సెంట్రల్ రీజినల్ బ్యూరో (CRB) ప్రెస్ టీం ఇన్‌చార్జ్‌గా నియమించారు.
రేణుక నక్సల్ సంస్థ తరపున పత్రికా ప్రకటనలు విడుదల చేసేది. “ప్రభాత్,” “మహిళా మార్గం,” “అవామి జంగ్,” “పీపుల్స్ మార్చ్,” “పోడియారో పోల్లో,” “ఝంకార్,” “సంఘర్ష్ట్ మహిళా,” “పితురి,” “మిడంగూర్,” “భూమ్కల్ సందేశ్” వంటి పత్రికలను ముద్రించి ప్రచురించేది. ఆమె సోదరుడు GVK ప్రసాద్ అలియాస్ సుఖ్‌దేవ్ అలియాస్ గుడ్సా ఉసేండి 2014లో తెలంగాణలో లొంగిపోయి ప్రస్తుతం ఢిల్లీలో BBC వార్తల సంస్థ ఇంచార్జిగా ఉంటున్నాడు.
2005లో రేణుక, సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM) శాఖమూరి అప్పారావు అలియాస్ రవిని వివాహం చేసుకుంది. అయితే, 2010లో నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతను మరణించాడు. రేణుక మృతి మావోయిస్ట్ పార్టీకి తీరని లోటు అని విప్లవకారులు భావిస్తున్నారు. ఆమె స్వగ్రామమైన కడవెండిలో అంతిమ యాత్ర కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేణక్క చివరి చూపు కోసం భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.

