వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
పాలకుర్తి హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను శనివారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. దవాఖానలో కలియ తిరిగి దవాఖాన నిర్వహణ, సిబ్బంది గైర్హాజర్, మందుల లభ్యత వంటి అంశాలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకొని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరుకాని పరిస్థితిని చూసి. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె సీరియస్ అయ్యారు. అక్కడి నుండే నేరుగా జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి, డ్యూటీలో లేని వారిపై చర్యలు తీసుకోమని ఆదేశించారు. అలాగే మందుల సరఫరా, శానిటేషన్ లను మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. ప్రజల ప్రాణాలను రక్షించే వైద్య సిబ్బందే బాధ్యతారాహిత్యంగా వుండటం బాధాకరమని, వారిపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. అమ్మా! పానం ఎట్లుంది?…. వైద్యం అందుతుందా?… డాక్టర్లు వస్తున్నారా?…. అంటూ… అక్కడి పేషెంట్లతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను వెంటనే తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఎమ్మెల్యే వెంట బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


