పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో రైతుల పంట పొలాలకు సాగునీరు అందించేందుకు కాలువల్లో పూడిక తీత పనులను చేపట్టాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కోరారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జీరో ఆవర్ లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవాదుల కాలువలను తవ్వి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కాలువల్లో ఉన్న పూడికతీతను తొలగించడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. కాలువల ద్వారా రైతులకు సక్రమంగా సాగునీరు అందించాలనే లక్ష్యంతో సొంత ఖర్చులు పెట్టుకొని కాలువల్లో పూడికతీత పనులు చేపట్టామని చెప్పారు. నియోజకవర్గంలో మరికొన్ని కాలువల్లో పూడికతీత పనులు అలానే ఉన్నాయని ఓఎన్ఎమ్ ద్వారా అభివృద్ధి చేయాలని స్పీకర్ ద్వారా మంత్రిని కోరారు. పూడికతీత పనులు చేపట్టకుంటే రైతులకు సకాలంలో సాగునీరు అందదని అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. పదేళ్లలో చేయలేని అభివృద్ధిని 15 నెలల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసి చూపిందని వివరించారు. పదేళ్లుగా కాలువల మరమ్మతు పనులు చేసి ఉంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు అసూయ పడుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమ అమలును తట్టుకోవడం లేదన్నారు. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థుల సంక్షేమం కోసం 40% మెస్ ఛార్జీలు, 200 కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కిందన్నారు. పదేళ్ల మంచిని మేము ఎత్తుకెళ్లలేదని, పదేళ్లుగా ప్రజలను విస్మరిస్తేనే ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి అధికారంలోకి తెచ్చారన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందించడంతో వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. చిరు వ్యాపారులను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వం పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఏదైనా ఒక మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు మాని అభివృద్ధి సంక్షేమ పథకాలకు బాసటగా నిలవాలని ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు సూచించారు. మా ప్రాంతంలో ఇళ్లపై నుండి 11 కెవి విద్యుత్ తీగలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

