తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే అనేకమలుపులు తిరుగుతున్న ఈ కేసులో ఏ-1గా ఉన్న ప్రభాకర్రావు, ఏ-6గా ఉన్న శ్రవణ్ రావు లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెడ్ కార్నర్ నోటీసులపై ఈ రోజు ఉదయం సీబీఐ (CBI) నుంచి రాష్ట్ర సీఐడీ (CID)కి సమాచారం అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లో నిందితులుగా ఉన్న వారిని వీలైనంత త్వరగా.. భారత్ కు తీసుకురావాలని కేంద్ర హోంశాఖతో పాటుగా విదేశాంగ శాఖలతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. కాగా ఈ కేసు ముందుకు సాగాలంటే వీరిద్దరిని ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న వారి కోసం ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో మొత్తం ఆరుగురిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఐదుగురు పోలీసు ఆఫీసర్లు, ఒక మీడియా సంస్థ యజమాని ఉన్నారు. ఏ-1గా ఉన్న ప్రభాకర్రావు, ఏ-6గా ఉన్న ఓ మీడియా అధినేత శ్రవణ్ రావులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, రాధాకిషన్రావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్రావు అరెస్టు అయ్యి జైలులో ఉన్న విషయం తెలిసిందే. కొందరు అనారోగ్య కారణాలు, ఇంకా కొందరు తమ వ్యక్తిగత సమస్యలతో కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకున్నారు.

