భారీ సంఖ్యలో హాజరై కోలాహలం చేసిన మహిళలు
హాజరైన ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల, తొర్రూరు మండల కేంద్రం రెడ్డి గార్డెన్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్(వెటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఝాన్సీ రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను సన్మానించి గౌరవించారు. అదే విధంగా హాజరైన మహిళమణులకు బహుమతులను అందించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ….. మహిళలు ఈ సమాజానికి నిలువెత్తు ప్రేరణ పురుషుల కంటే తక్కువ కాకుండా, అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారన్నారు. ప్రతి మహిళ తన లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకెళ్లాలని, ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కొని, విజయాన్ని సాధించగలిగే సత్తా వున్న వాళ్ళు మహిళలు మాత్రమేనన్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సమాజంలో మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకి ధన్యవాదాలు తెలిపారు.


సభ అధ్యక్షత వహించిన వెటా ఫౌండర్ హనుమాండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. ఈ వేడుకను మహిళల ప్రగతికి అంకితం చేస్తూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వెటా ఫౌండేషన్ మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందని, ఔత్సాహిక మహిళలకి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించి వారికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. సమాజంలో మార్పు రావాలంటే మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. అందుకు కుటుంబం, సమాజం అందరూ సహకరించాలని కోరారు. భవిష్యత్తులో మహిళలకు మరింత సహాయం చేయడానికి వెటా ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందన్నారు. మహిళా సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.

అదే విధంగా సన్మానం పొందిన వైద్య, విద్య, క్రీడా, రాజకీయ, సేవా రంగాల్లో గుర్తింపు పొందిన మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. సమాజంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అవసరమని, పురుషులతో సమానంగా అవకాశాలు దొరకాలన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మహిళలకి పూర్తి మద్దతు ఇచ్చి స్వయం ఉపాధి, స్టార్ట్-అప్‌లు, వృత్తిపరమైన శిక్షణలో సహాయం చేయాలని కోరారు. ఇప్పటికే విజయాలు సాధించిన మహిళలు యువతకు మార్గదర్శకంగా ఉండటం ద్వారా మరెందరో స్త్రీలు ముందుకు రావచ్చని చెప్పారు.

ఈ వేడుకలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేట సభ్యులు, మహిళా సంఘాల నాయకులు, మహిళలు విద్యార్థినులు, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.

