ఎందరో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన బడి అది, ఎందరినో ఉన్నతులను చేసిన గుడి అది. ఎంతో చరిత్ర కలిగిన జనగామ జిల్లా పాలకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పుడు రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాల నిలయంగా మారింది. గత ప్రభుత్వ కాలంలో గత పాలకుల కారణంగా స్కూల్ అభివృద్ది పేరుతో బడి ప్రహరీ గోడను కూల్చి గేటును తీసివేశారు. ఆ తరువాత జరిగిన పలు ఎన్నికలు, ఆ ఎన్నికల కోడ్ ల కారణంతో పాటు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆ పనులు ఆగిపోయాయి. దాంతో మందుబాబులకు తాగడానికి ఒక సిట్టింగ్ అడ్డా దొరికినట్లయింది. ఉదయం పూట విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఆ బడి ఆవరణ రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది. మందుబాబులు తాగి తందనాలు ఆడుతున్నారు. వారు తాగేసిన మందు సీసాలను, తినిపడేసిన చెత్త చెదారన్ని తరగతి గదుల్లో, వరండాలో పడేస్తున్నారు. అప్పుడప్పుడు నానా అల్లరి చేస్తున్నారు. దీంతో చుట్టుప్రక్కల వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. పైగా తెల్లారేసరికి తాగి పడేసిన సీసాలు, తినిపడేసిన చెత్త చెల్లాచెదురుగా పడివుంటున్నాయి. ఈ విషయమై అధికారులు దృష్టిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.


