అడుగు ఎక్స్ క్లూజివ్
కమలంలో కథనోత్సాహం-5
తెలంగాణకు ఓ యడ్యూరప్ప కావాలి!
ముందుండి నడిపించే నాయకుడు రావాలి!
కాషాయానికి కవచం కావాలి
ఎన్నికేదైనా బీజేపీనే గెలిపించాలి!
బండి అలాగే ఉండి ఉంటే, 2023లోనే బీజేపీ గెలిచేదా!?
అదే బీజేపీ చారిత్రక తప్పిదమా?!
తెలంగాణలో బీజేపీని గెలుపు తీరాలకు చేర్చేదెవరు?
ఆ తెగువ, చొరవ, త్యాగం, యోగం ఉన్న ఆ కమల కిరీటి ఎవరు?
పని చేసే నేతకు పట్టం కట్టడానికి ఎదురుచూస్తున్న బీజేపీ!
1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండేది. ఢిల్లీ సహా దేశంలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, వాళ్ళంతా వెళ్ళేది. వాళ్ళని చూసిన బీజేపీ పెద్దలు నెక్ట్స్ మనం అధికారం చేపట్టేది ఎపీలోనే అనేవారు. వారి ప్రభావం పార్టీపై అంతగా ఉండేది. ఆ టైమ్ లో పార్టీ పరంగా ఏపీకి కర్ణాటకకు మధ్య మంచి పోటీ ఉండేది. అదే సమయంలో కర్ణాటకలో శికరిపుర నియోజకవర్గంలో 1983 నుంచి వరసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన యడ్యూరప్ప, 1994నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999లో ఓటమి చవి చూశారు. అప్పుడు కేంద్రంలో వాజ్ పేయి ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం ఉంది. పార్టీ అధినాయకత్వం యడ్యూరప్పని కేంద్ర మంత్రిగా ఉండాలని ఆదేశించింది. ఎదురొచ్చిన ఆ అదృష్టాన్ని ఎవరు కాదనుకుంటారు? కానీ, యడ్యూరప్ప సున్నితంగా వద్దన్నారు! తాను రాష్ట్రంలోనే పని చేస్తూ పార్టీని పవర్ లోకి తెస్తానన్నారు. ఆశ్చర్యపోయిన బీజేపీ అధినాయకత్వం ఆయనను వెంటనే కర్ణాటక శానస మండలికి ప్రమోట్ చేసింది. ఆయన అన్నంత పనీ చేశారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని మొదటిసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంగా కర్ణాటకని నిలిపారు. అలా పార్టీని నిలపగలిగే ఒక యడ్యూరప్ప ఇప్పుడు తెలంగాణకు కావాలి. సమర్థ నాయకత్వ పునాదులున్నాయి. పుణికి పుచ్చుకున్న వారసత్వం ఉంది. యువతరం ఉరకలు వేస్తోంది. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. తెగువ, చొరవ, త్యాగానికి పర్యాయంగా, పార్టీని ముందుండి నడిపించే నాయకుడి కోసం బీజేపీ ఎదురుచూస్తున్నది
అయితే, కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేరిన రెండేళ్ళల్లో ఆ పార్టీ అధ్యక్షుడై, పాదయాత్ర చేసి, అధికారంలోకి తెచ్చి, సీఎం అయిన రేవంత్ రెడ్డి మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ ని గెలిపించి సీఎం అయిన వై.ఎస్.ని మనం చూశాం. బీజేపీ నుండి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ఆ ప్రయత్నం చేశారు. రాజకీయ పరమపద సోపానంలో ఆయన్ని ఏ పాము మింగిందో! కానీ, ఆ దశలోనే ఆయన్ని ఆ పదవి నుంచి బీజేపీ తప్పించింది. “బండి ” అలాగే ఉండి ఉంటే, 2023లోనే బీజేపీ గెలిచి ఉండేదేమో!? బహుశా అదే బీజేపీ చారిత్రక తప్పిదం అయిందేమో?! ఇక ఇప్పుడు తెలంగాణలో బీజేపీ చరిత్రను తిరగరాసే తెగువ, చొరవ, త్యాగం, యోగం ఉన్న ఆ అదృష్ట జాతకుడు ఎవరో?
అవును. బీజేపీని అధికారంలోకి తేవాలన్న కసి, పట్టుదల ఉన్న కాషాయ నేత కోసం ఆ పార్టీ అధినాయకత్వం దుర్భిణీ వేసి వెతుకుతున్నది. నిజమే. యడ్యూరప్ప పడిలేచిన కెరటంగా 2004లో తిగిరి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నేత అయ్యారు. జనతాదళ్ (ఎస్)-బీజేపీ మధ్య చెరిసగం చొప్పున అధికార మార్పిడికీ ఒప్పందం కుదిరింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎం అయ్యారు. ఒప్పందం ప్రకారం తన పదవీ కాలం ముగిశాక, అప్పటి సీఎం కుమారస్వామి పదవిని వదలుకోవడానికి ఒప్పుకోలేదు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో కుమారస్వామి తప్పుకోక తప్పలేదు. ఒప్పందం ప్రకారం 2007లో బీజేపీ తరపున యడ్యూరప్ప సీఎం అయ్యారు. 7 రోజులకే బీజేపీకి, జనతాదళ్ (ఎస్) మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. అయితే 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని యడ్యూరప్ప అధికారంలోకి తెచ్చారు. మే 30న సీఎం అయ్యారు. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని మొదిటి సారి అధికారంలోకి తెచ్చిన నేతగా మిగిలారు. ఆ తర్వాత మళ్ళీ రెండుసార్లు.. మొత్తం 4సార్లు కర్ణాటకలో బీజేపీ యడ్యూరప్ప నేతృత్వంలోనే పవర్ లోకి వచ్చింది. కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజిక వర్గాన్ని ఏకం చేశారు. దేశంలోనే మొదటి సారిగా ట్రాన్స్ జెండర్లకు 1శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం కర్ణాటక! తర్వాత బీజేపీతో విభేదించిన యడ్యూరప్ప, కర్ణాటక ప్రజా పక్ష పేరుతో వేరే పార్టీ పెట్టారు. తర్వాత ఆ పార్టీని బీజేపీలో వీలీనం చేశారు. పార్టీ 75ఏళ్ళ వయోపరిమితి నిబంధనను అనుసరించి 4వ సారి సీఎం అయిన రెండేళ్ళకు తన పదవికి రాజీనామా చేశారు. ముందు తరాలకు అవకాశాల కోసం ప్రత్యక్ష ఎన్నికల నుంచి స్వచ్ఛందంగా విరమించారు. ఆతర్వాత తనకు రాజకీయ భిక్ష పెట్టిన బీజేపీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేసి ప్రశాంత జీవనంలోకి వెళ్ళారు. యడ్యూరప్ప 80వ జన్మదినోత్సవం సందర్భంగా ‘‘ఆయన జీవితం ప్రతీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకం, ఆదర్శమ’’ని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
సమర్థ నాయకత్వ పునాది
దేశంలోనే, కర్ణాటక కంటే ముందే, తెలంగాణలో బీజేపీకి ప్రజలు మద్దతుగా నిలిచారు. 1980లో ఏర్పడ్డ బీజేపీకి 1984 ఎన్నికల్లోనే హనుమకొండలో ఒక ఎంపీని గెలిపించారు. వాజ్ పేయి, అద్వానీ లాంటి మహామహులే మట్టికరచిన ఆ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది రెండే రెండు సీట్లు. అందులో ఒకటి గుజరాత్ నుంచి కాగా, మరొకటి మన హనుమకొండ. అప్పటికే కాకలుతీరిన నేతగా, కేంద్ర మంత్రిగా, మాజీ సీఎం కూడా అయిన పీవీని ప్రజలు ఓడించి బీజేపీని గెలిపించారు. 1985లోనే వన్నాల శ్రీరాములు వరంగల్ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ పంపారు. అప్పట్లో ఇప్పటి మాజీ ఉప రాష్ట్రపతి, మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎం.వెంకయ్యనాయుడు, మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి బంగారు లక్ష్మణ్, చందుపట్ల జంగారెడ్డి, బద్దం బాల్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర, మాజీ గవర్నర్ రామారావు, సత్యనారాయణరెడ్డి లాంటి హేమాహేమీలు ఉండేవారు. 1999నాటి 12 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది వీరిలో ఉన్నారు. వీళ్లు అసెంబ్లీలో ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రోశయ్య వంటి ఉద్ధండులతో ఢీ కొట్టిన వారే. వీరు మాట్లాడితే ఎంతో మంది వారి ఉపన్యాసాలు వినడానికి ఉవ్విళ్ళూరేవారు. వారి వాక్పటిమకు అంతా సలామ్ కొట్టి గులాములైన వారే. వీళ్ళంతా ఆ తర్వాత కాలంలో కేంద్ర మంత్రులుగా, రాష్ట్రాల గవర్నర్లుగా, వెంకయ్య నాయుడు ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగానే గాక, ఉపరాష్ట్రపతిగా అత్యున్నత, సమున్నత పదవులు నిర్వహించినవారే కావడం విశేషం.
పుణికి పుచ్చుకున్న వారసత్వం
తెలంగాణలో బీజేపీకి ఇంతటి సమర్థ నాయకత్వ వారసత్వం కూడా ఉంది. ఈ నాయకత్వాన్ని చూస్తూ ఎదిగిన వారే ప్రస్తతం బీజేపీలో ఉన్న ప్రముఖ నాయకులు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెంకయ్యనాయుడికి శిష్యుడు. కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వంటి ఎందరో లీడర్లు వీళ్లని చూస్తూనే ఎదిగారు.
సమర్థులు సరే, సాఫల్యాలేవి?
ఇక ఇప్పుడున్న బీజేపీ నాయకుల్లో, ఎన్నికైన 8 మంది ఎంపీలు డి.కె అరుణ (మహబూబ్ నగర్), అరవింద్ ధర్మపురి (నిజామాబాద్), బండి సంజయ్ కుమార్ (కరీంనగర్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజీగిరి), రఘునందన్ రావు (మెదక్), కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ళ)… 8 మంది ఎమ్మెల్యేలు రాజాసింగ్ (ఘోషామహల్), ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి (కామారెడ్డి), ఆలేటి మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), పాల్వాయి హరీశ్ బాబు (సిర్పూర్ కాగజ్ నగర్), రామారావు పవార్ (మధోల్), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), పైడి రాకేశ్ రెడ్డి (ఆర్మూర్), ధన్ పాల్ సూర్య నారాయణ (నిజామాబాద్ అర్బన్) లకు కూడా చెప్పుకోదగ్గ సామాజిక, రాజకీయ వారసత్వం ఉంది. సంఘ్ పరివార్ శాఖల్లో పని చేసిన నేపథ్యమూ ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో ఆరితేరిన అనుభవం కూడా ఉంది. వీరిలో చాలా మంది అనేకసార్లు గెలవడం, ఎన్నో పదవులు నెరపడం జరగుతూనే ఉంది. అయితే గత నాయకత్వం ప్రస్తుత నాయకత్వానికి సరైన జవసత్వాలు అందించలేకపోయింది. ఇప్పటి నాయకత్వం యడ్యూరప్పలాంటి పట్టుదల, పోటీ, పోరాటతత్వాన్ని, త్యాగ గుణాన్ని అందిపుచ్చుకోలేదు. అందుకే ఇప్పుడు తెలంగాణకు ఒక యడ్యూరప్ప కావాలి. యడ్యూరప్పలాంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న నేతలు కావాలి. అప్పుడే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాగలుగుతుంది.
ఆశల పల్లకీ లో నేతలు!
ఇప్పటికిప్పుడు మంచి అవకాశం వచ్చినా, పార్టీ గెలిచినా, సీఎం అభ్యర్థిత్వానికి పోటీ పడగల అభ్యర్థులు బీజేపీలో చాలా మందే ఉన్నారు. ఆ పార్టీ వర్గాల సమాచారం మేరకు బీసీ నాయకులుగా బీజేపీ జాతీయ బీసీ మోర్చ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడు ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి, రెడ్డి సామాజిక వర్గం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి పరిశీలిస్తే మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఉన్నారు.
వాజ్ పేయి, అద్వానీ వారసులుగా మోడీ, షా
బీజేపీకి జాతీయ స్థాయిలో జవసత్వాల నింపిన చరిత్ర వాజ్ పేయి, అద్వానీలకు దక్కుతుంది. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని మోడీ, అమిత్ షాలు పదిలంగా మోస్తున్నారు. కాబట్టే బీజేపీని వరసగా మూడోసారి కేంద్రంలో పవర్ లోకి తేగలిగారు.
అయితే, కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేరిన రెండేళ్ళల్లో ఆ పార్టీ అధ్యక్షుడై, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చి, సీఎం అయిన రేవంత్ రెడ్డి మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ ని గెలిపించి సీఎం అయిన వై.ఎస్.ని మనం చూశాం. బీజేపీ నుండి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ఆ ప్రయత్నం చేశారు. రాజకీయ పరమపద సోపానంలో ఆయన్ని ఏ పాము మింగిందో! కానీ, ఆ దశలోనే ఆయన్ని ఆ పదవి నుంచి బీజేపీ తప్పించింది. బండి అలాగే ఉండి ఉంటే, 2023లోనే బీజేపీ గెలిచి ఉండేదేమో!? బహుశా అదే బీజేపీ చారిత్రక తప్పిదం అయిందేమో?! ఇక ఇప్పుడు తెలంగాణలో బీజేపీ చరిత్రను తిరగరాసే తెగువ, చొరవ, త్యాగం, యోగం ఉన్న ఆ అదృష్ట జాతకుడు ఎవరో?

