గుడిసె వాసులను మోసం చేశారన్న ఫిర్యాదుపై అరెస్ట్!
హైదరాబాద్ కు వెళ్లి మరీ పట్టుకొచ్చిన పోలీసులు
ఇది రాజకీయ కక్షేనంటున్న బీఆర్ఎస్ శ్రేణులు
సిపిఎం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతగా, ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న దుబ్బ శ్రీనివాసును వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత ఆదేశానుసారమే శ్రీనివాసులును పోలీసులు వేధిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసులును వరంగల్ నుంచి వెళ్లిన పోలీసులు హడావుడిగా అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు దుబ్బ శ్రీనివాస్ అరెస్టు సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ సుకూర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టేషన్ పరిధిలోని ఎమ్మెస్ నగర్ లో సదరు నిందితుడు కమ్యూనిస్టు పార్టీలో ఉండగా పేదలకు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయించాడు. ఆ గుడిసె వాసుల నుండి లక్షల్లో రూపాయలు వసూలు చేసినట్టుగా కాలనీ బాదిత మహిళలు ఫిర్యాదు చేశారు. తిరిగి అడిగిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు విచారణ చేసిన అనంతరం సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్టుగా వివరించారు. ఇంకా పలువురు బాధితులు ఉన్నట్టుగా పలు రకాల ఆరోపణలు ఉన్నాయని ఇన్స్పెక్టర్ వివరించారు.
శ్రీనివాస్ కు అస్వస్థత:
ఇదిలా ఉండగా, పోలీసుల అదుపులో ఉన్న దుబ్బ శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి పోలీసులు తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో శ్రీనివాస్ కు చికిత్స అందిస్తున్నారు.

