అబద్ధాలతో గెలవలేరు… నిబద్ధతతో నిలవండి!!
కనీసం ఓటర్ల జాబితాను కూడా వెల్లడించకుండా ఓటింగా!?
ఆర్యవైశ్యులను తెలివితక్కువగా చూడటం మీ మూర్ఖత్వం
అమరవాది ఆరోపణలకు… మిడిదొడ్డి శ్యాం వివ‘రణం’!
తెలంగాణ ఆర్యవైశ్యులు తెలివైన వారని, అమరవాది చేస్తున్న అసత్య ఆరోపణలను గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పి తీరుతారని ఆర్యవైశ్యమహాసభ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిడిదొడ్డి శ్యాం సుందర్ అన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నేపథ్యంలో పోటీలో నిలిచిన అభ్యర్థుల ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అమరవాది లక్ష్మీనారాయణ చేసిన పలు ఆరోపణలకు ఆయన ప్రత్యర్థి మిడిదొడ్డి శ్యాంసుందర్ ఒక ప్రకటనలో సమాధానమిచ్చారు.
‘‘నేను 2011లో ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడి, ఒక భవనాన్ని కట్టించాను, ఆరు ఎకరాల 3 గుంటల స్థలం కొన్నాను. 25వేల రూపాయల చొప్పున విరాళాలుగా 9 లక్షలు సేకరించగా, ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న మాణిక్ ప్రభు సూచన మేరకు తక్కవపడిన 6 లక్షల రూపాయలను తను సొంతంగా 5 లక్షలు, లక్ష సాయి కిషోర్ వి పెట్టి ఆ స్థలం కొన్నాం. జిల్లా ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ట్రస్టు పేరున రిజిస్ట్రేషన్ చేయించాం. ఈ రోజు ఆ స్థలం రూ.5 కోట్లు విలువ చేస్తుంది. అది ఇప్పటికీ కూడా సంఘానికే వుంది. ఎటువంటి అనుమానాలు లేవు. నా తరువాత ఉమ్మడి జిల్లాకు చంద్రకుమార్ అధ్యక్షులయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అయిన తరువాత జిల్లా కేంద్రంలో బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఆకారపు కుమారస్వామి కుమారులు వారి నాన్న స్మారకార్థం 500 గజాల స్థలాన్ని జిల్లా సంఘానికి బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ స్థలానికి రోడ్డు లేకపోవడం, ఆది క్లియర్ కాకపోవడంతో ఇంకా సంఘం చేతికి అందలేదు. హ్యాండ్ ఓవర్ చేస్తే బిల్డింగ్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నేను జిల్లా అధ్యక్షుడిని కాదు. నాగర్ కర్నూల్ లో గత ఆరేళ్లుగా ఎన్నికలు జరగలేదంటున్నారు. నేను నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిని కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని కాదు. పట్టణ అధ్యక్షుడిని కాదు. హకీమ్ మురళి స్వయాన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వారి గ్రామం అది. అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సింది ఉపాధ్యక్షులా? రాష్ట్ర అధ్యక్షులా? పట్టణ అధ్యక్షులా? సామాన్య కార్యకర్త గా ఉన్న శ్యాం ఎన్నికలు నిర్వహించాలా? దీనికి అమరవాది వివరణ ఇవ్వాలి. తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ఆ తరువాత శ్రీశైలంలో మల్లికార్జున సత్రం గురించి, సత్రం రూ.36 కోట్లు పెట్టి కట్టిండు శ్యాం. నాలుగు కోట్లు అప్పు చేసిండు అని ఒక మీటింగులో, సత్రంలో డబ్బులు తీసుకొని టూర్లు పోతున్నారని మరో మీటింగ్ లో, సత్రంలో ఫ్రీ భోజనం పెట్టట్లేదని ఇంకో మీటింగ్ లో… ఇన్ని తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. రూ.36 కోట్లు పెట్టి సత్రం కట్టింది వాస్తవం. సరిపోకపోతే నాలుగు కోట్ల రూపాయలు నా మిత్రులతో కలిసి అప్పు చేసి నిర్మాణం పూర్తి చేసినం. అందులో రూ.3 కోట్లు అప్పు కూడా తీర్చినం ఇంకో కోటి రూపాయలు అప్పు వుంది. మేము టూర్ కు పోయినమంటే తలాకొంత డబ్బులు వేసుకొని, చీటిలు వేసుకొని పోయాం. ఇప్పుడు సత్రంలో బాకీ ఉందా? ఇంకేమైనా ఉందా? అమరవాదే చెప్పాలి. సత్రాల్లో భోజనాల గురించి మాట్లాడారు. ఆయన లెక్క మూర్ఖులు కాదు ఇప్పుడు. పూర్వకాలం నుండి ట్రస్టుల రూపంలో సత్రాలు ఒక లెక్క ప్రకారం, పద్ధతిగా నడుస్తున్నాయి. మేము కూడా సత్రంలో పొద్దున రెండు రకాల టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, టీ, కాఫీలు అన్ని ఉచితంగా అందచేస్తున్నాం. సత్రంలో కేవలం రూమ్ చార్జీలు తీసుకుంటున్నాం. మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. నెలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది. సుమారు వంద మంది సిబ్బంది పని చేస్తున్నారు వారికి ఆ ఖర్చుల నుండే జీతాలు ఇస్తున్నాం. అది మీరు నడిపే వ్యాపార సంస్థ కాదు అది ఒక సేవా సంస్థ. అయ్యా అమరవాదీ, మీరు తప్పుడు ప్రచారాలతో గెలవాలనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. తెలంగాణ ఆర్యవైశ్యులు ఏమి తెలియని వారు కారు. తెలివిలేని వారు కారు. నేను కచ్చితంగా మీకు వివరణ ఇచ్చాను. మీరు గమనించండి. ఒకపూట శ్రీశైలం సత్రానికి పోయి భోజనం చేసి రండి. ఈ ఎన్నికలో మీ కోసం ప్రచారం చేస్తున్న వాళ్లనే ఎన్నికల అధికారిగా నియమించుకున్నారు. కనీసం ఓటర్ల లిస్టు కూడా మాకు ఇవ్వకుండా ఆ ఓటర్ల లిస్టు తీసుకుని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలు సక్రమంగా జరిగి, ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పులు జరగకుండా గెలిస్తే బాగుంటుంది. మీరు పెద్దలు, విజ్ఞులు, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. తప్పుడు పనులు చేయకండి మీరు మాతో చెప్పించుకోవడం పద్ధతి కాదు. మేము మీ తప్పులు చెప్పామే తప్ప తప్పుడు ఆరోపణలు చేయడం లేదు. అబద్ధాలతో ఎన్నికలు గెలవాలనుకోవడం అసంభవం. మీ అవివేకం. ఇప్పటికే మీ మిమ్మల్ని, మీ అవినీతిని సంఘ సభ్యులే ఛీత్కరిస్తున్నారు. తప్పుడు మాటలు కాదు.. మీరు చేసిన తప్పుడు పనులను గుర్తించుకోండి. సేవను చెప్పుకొని ఓట్లడగండి. అట్లయినా ఆర్యవైశ్యులు ఆదరిస్తారేమో చూడండి. లేదంటే ఆర్యవైశ్యుల ఆగ్రహానికి గురికాక తప్పదు.’’

