బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఫిబ్రవరి 19న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి పార్టీ కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మాజీ మరియు ప్రస్తుత ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరుకానున్నారు. సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రధానంగా చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ హామీల సాధన, ప్రజల్లో చైతన్యం కలిగించే వ్యూహాలపై నేతలు, కార్యకర్తలు అనుసరించాల్సిన మార్గదర్శకాలు కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కీలక సమావేశానికి అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

