“నా భూమిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదు”
తెలంగాణలో మొయినాబాద్ మండలం, తోల్కట్ట గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భూమిలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకున్నాయనే వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
2018లో తోల్కట్ట గ్రామంలో సర్వే నంబర్ 165 పార్ట్‌లో 10 ఎకరాల 1 గుంట భూమిని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఆ భూమి నిర్వహణ బాధ్యతలను తన మేనల్లుడు జ్ఞాన్దేవ్ రెడ్డికి అప్పగించినట్లు చెప్పారు. సదరు భూమిలో ఎటువంటి ఫార్మ్ హౌస్, గెస్ట్ హౌస్ లేవని, కేవలం మామిడి, కొబ్బరి తోట మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
తన అనుమతి లేకుండా జ్ఞాన్దేవ్ రెడ్డి, వర్రా రమేష్ కుమార్ రెడ్డికి ఆ తోటను కౌలుకు ఇచ్చిన విషయం నిన్నటి ఘటన అనంతరం మాత్రమే తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తరువాత వర్రా రమేష్ కుమార్ రెడ్డి, ఎం. వెంకటపతి రాజుకు తోటను కౌలుకు ఇచ్చినట్లు కూడా తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం తనకు తెలియకుండానే జరిగిందని, దీనికి తన ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.
నిన్న వార్తలు చూసిన తర్వాత ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చింది. తన భూమిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో, దీనికి తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని తెలిపారు. సంఘటన జరిగిన రోజున తాను హైదరాబాద్‌లో లేరని, వరంగల్‌లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను 20 ఏళ్లుగా మచ్చలేని రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నానని, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని, నోటీసుకు సమాధానం ఇస్తానని చెప్పారు. నిరాధార ఆరోపణలతో మీడియా కథనాలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

