తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్ట్కర్, బలరాం నాయక్, కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య ఎటువంటి విభేదాలు లేవని మల్లు రవి స్పష్టం చేశారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం సైంటిఫిక్ పద్ధతిలో కుల గణన చేపట్టిందని, 50 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగిందని తెలిపారు. మొత్తం 3.54 కోట్ల మంది ప్రజలు ఈ కుల గణనలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అయితే, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా ఈ గణనలో పాల్గొనలేదని ఆరోపించారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నదని, ఈ కుల గణన వెనుక ఉన్న ప్రధాన కారణం రాహుల్ గాంధీయేనని మల్లు రవి వెల్లడించారు.
కుల గణనపై రాజకీయం చేయడం సరికాదని ఎంపీ సురేష్ షెట్ట్కర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తప్పకుండా బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఉందని, కుల గణనపై బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. తెలంగాణ ఈ విషయంలో రోల్ మోడల్‌గా నిలవాలని, రాహుల్ గాంధీ దీనిపై గట్టి నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పట్ల కట్టుబడి ఉందని, ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు.
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కుల గణనను ముందుకు తీసుకెళ్లేందుకు చాలా కృషి చేశారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సూచనలను సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో అమలు చేశారని, ప్రజలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ గణన నిర్వహించారని తెలిపారు. ఈ గణన ద్వారా బీసీలకు మరింత ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిజమైన సామాజిక న్యాయం కోసం పనిచేసే పార్టీ అని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కాంగ్రెస్ మాత్రం నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
కుల గణనపై ప్రధానిని కలవాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. బీజేపీ ఎంపీలు కూడా తమతో కలిసి రావాలని కోరారు. కుల గణనపై ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ముందు బీఆర్ఎస్ నేతలు తలెత్తుకుని తిరగాలంటే, వారు కుల గణన సర్వేలో పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉంటుందని, ప్రజల సంక్షేమం కోసమే ఈ కుల గణన చేపట్టినట్లు వివరించారు.

