తెలంగాణకు ఆరవై ఏళ్ల పోరాటం తర్వాత సోనియా గాంధీ వల్లే రాష్ట్రం వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని గౌరవంతో చూస్తారని అన్నారు. తాను సోనియా గాంధీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించినట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తగా ఆమె పేరుతో ఓట్లు అడిగానని, జాతీయ నాయకులను ప్రచారంలో భాగం చేస్తేనే అధిక ఓట్ల శాతం సాధించగలమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక నేతల పేరుతో ఓట్లు అభ్యర్థిస్తున్నప్పటికీ, ప్రజల మీద జాతీయ నాయకత్వ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రేవంత్ అన్నారు. స్థానిక నేతలు కష్టపడటంతో పాటు, జాతీయ నాయకత్వం పేరుతో ఓట్లు అడిగితేనే అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
“మీరు రేవంత్ రెడ్డికి ఓటు వేయమంటే ఆయన్ను కుల ప్రాతిపదికగా చూసే ప్రమాదం ఉంది. కానీ జాతీయ నాయకత్వం పేరుతో ఓట్లు అభ్యర్థిస్తే వర్గ విభజన అనేది పెద్దగా ఉండదు” అని ఆయన విశ్లేషించారు. అందుకే, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యూహంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

