ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను సీఎం ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంబంధిత సభలకు హాజర కావాలని ఖర్గేను ఆహ్వానించారు.
గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఐదు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలపై విస్తృతంగా చర్చించారు. సూర్యాపేటలో జరగనున్న కులగణన సభకు రాహుల్ గాంధీని, మెదక్‌లోని ఎస్సీ వర్గీకరణ సభకు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు.
అంతేకాకుండా, భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అందులో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, వ్యయానికి సంబంధించిన వివరాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంజూరైన నిధులను కూడా వివరించినట్లు సమాచారం.

