తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యను విప్లవాత్మకంగా అభివృద్ధి చేసేందుకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ విధానాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, విద్యార్థులకు అధునాతన శిక్షణ అందించేందుకు పాఠశాల విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్ స్టెప్ ఫౌండేషన్ ను విద్యా శాఖ కార్యదర్శి డా. యోగితా రాణా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈరోజు (జనవరి 30) సందర్శించింది. ఈ బృందంలో ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులు పాల్గొన్నారు.
ఎక్ స్టెప్ ఫౌండేషన్ – AI ఆధారిత విద్యకు కీలక భాగస్వామి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్థాపించిన ఎక్ స్టెప్ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పరిష్కారాలను అందించడంలో ఈ సంస్థ ప్రముఖంగా పనిచేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఎక్ స్టెప్ ఫౌండేషన్‌తో కలిసి తీసుకునే ముఖ్య నిర్ణయాలు:ఫౌండేషనల్ లిటరసీ, న్యూమెరసీ (FLN) – ప్రాథమిక విద్య స్థాయిలో AI ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా విద్యార్థుల పఠన, లేఖన, గణిత నైపుణ్యాల పెంపు.
AI ఆధారిత డిజిటల్ ఇనిషియేటివ్స్ – ప్రత్యేకమైన టూల్స్, ప్లాట్‌ఫామ్స్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసాన్ని మెరుగుపర్చడం.
డేటా ఆధారిత విశ్లేషణ (Data-Driven Insights) – విద్యార్థుల లోపాలను గుర్తించి, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం.
ఉపాధ్యాయుల శిక్షణ – తరగతి గదుల్లో డిజిటల్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం.
కేరళ మోడల్ ను తెలంగాణలో అమలు
2024లో కేరళ విద్యా విధానాన్ని పరిశీలించిన తెలంగాణ ప్రతినిధి బృందం, ఆ రాష్ట్రంలో AI ఆధారిత టూల్స్ వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించినట్లు గుర్తించింది. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ను తెలంగాణ విద్యా రంగంలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు.
ఎక్ స్టెప్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో, తెలంగాణ ప్రభుత్వం సమగ్ర AI ఆధారిత విద్యా ప్రణాళిక రూపొందిస్తోంది. విద్యార్థులకు స్నేహపూర్వక అభ్యాస పద్ధతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, డిజిటల్ విద్యా ప్రమాణాల పెంపు రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.

