ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, ఇక్కడ ఒక అద్భుతమైన ఎకో టూరిజం పార్క్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధితో పాటు టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. టెంపుల్ టూరిజం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుతో పాటు ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని వివరించారు. రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి, నల్లమల అడవులు, మల్లెల తీర్థం వంటి అద్భుతమైన ప్రకృతి, పురాతన దేవాలయ సంపద తెలంగాణలో ఉన్నాయని తెలిపారు.
వికారాబాద్ అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడం ద్వారా ఇది ముఖ్య పర్యాటక కేంద్రంగా మారనుందని చెప్పారు. త్వరలో కొత్త టూరిజం పాలసీని తీసుకురావడంతో పాటు ప్రతీ విద్యార్థి తల్లి పేరుతో మొక్కలు నాటే విధానాలను ప్రోత్సహించనున్నామని చెప్పారు. ఎకో టూరిజం అభివృద్ధి కోసం రామ్ దేవ్ గారు ఎక్స్‌పీరియం పార్క్‌ను అభివృద్ధి చేయడం అభినందనీయం అని అన్నారు. తెలంగాణను ఒక ప్రకృతి వనంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంగా ప్రకటించారు.

