–నేడు వరంగల్ కూరగాయల మార్కెట్లో సంతకాలు
-ఏకతాటిపై అఖిలపక్షం ఐక్యవేదిక కార్యక్రమాలు
-విజయం దిశగా పడుతున్న ‘అడుగు’ లు
ఆట మొదలైంది. ఆట ‘ఆది’ నుంచే మొదలైంది. ‘ఓం’ కారంతో శ్రీకారం చుట్టిన కార్మికులు సమర శంఖారావం పూరించారు. కార్మిక స్థల కబ్జాకు మూల కారణాన్ని సమూలం చేసే అసలు క్రతువును ఆరంభించారు. చెరపట్టిన వారిపై ఫిర్యాదులు, పోలీసు స్టేషన్ లో హాజర్లు, విచారణలను పూర్వ కార్మికులే అపూర్వంగా చేపట్టారు.

రోజురోజుకు ఉధృతం అవుతున్న అజం జాహి కార్మిక స్థల పరిరక్షణ ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. మిల్లుతో పేగు బంధం కలిగిన కార్మికులు, కార్మిక కుటుంబాలు రంగంలోకి దిగాయి. కార్మిక భవన స్థలాన్ని, తన పదవిని తాకట్టు పెట్టిన పూర్వ సంఘం అధ్యక్షుడి పని కట్ చేయడానికి కనికట్టుగా నేరుగా అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. అసలు కార్మిక భవన స్థలం కబ్జా కావడానికి కారణాలను వెలికి తీసే విధంగా విచారణ జరిపించారు. మరోవైపు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఏర్పాట్లు చేయించుకున్న సదరు బడా వ్యాపారిపై, వరంగల్ వర్తక, వ్యాపార, ఆర్యవైశ్య సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ కార్మిక భవన స్థలాన్ని ఆ కబ్జా నుంచి రక్షించాలని, కూల్చిన చోటే కొత్త భవన నిర్మాణానికి సహకరించాలని, అందుకు అనుగుణంగా ఆ బడా వ్యాపారిపై ఒత్తిడి తేవాలని అజం జాహి కార్మిక సంఘ అధ్యక్షుడు ఇనుముల శ్రీనివాస్, కార్యదర్శి ఆరెల్లి కృష్ణ ఒత్తిడి పెంచారు.
పూర్వ అధ్యక్షుడిపై పోలీసుల విచారణ
అజం జాహీ మిల్లు కార్మిక సంఘం కార్యవర్గంలో గతంలో కీలకంగా పని చేసిన పూర్వ అధ్యక్షుడిపై వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కార్మిక నాయకులు ఫిర్యాదు చేశారు. సీఐ సుకుర్ పోలీస్ స్టేషన్ కార్మిక నాయకుడిని పిలిపించి వివరాలు సేకరించారు. కార్మిక భవన విక్రయంలో అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎవరెవరు భాగస్వాములు అయ్యారు. వారికి సహకరించిందెవరు? ఏంటనే అంశాలపై సీఐ విచారణ చేపట్టారు. మరో మారు ఆ కార్మిక నాయకుడిని పిలిచి విచారిస్తానని కార్మిక సంఘం నేతలకు సిఐ హామీ ఇవ్వడంతో కార్మికులు వెను తిరిగారు. మరోసారి విచారణకు సిద్ధమయ్యారు.

బడా వ్యాపారిపై ఫిర్యాదు
వరంగల్ అజం జాహి కార్మిక భవన కొనుగోలు అంశంలో పలు విమర్శలు ఎదుర్కొంటున్న వరంగల్ ప్రముఖ వస్త్ర వ్యాపారి పై అజం జాహి కార్మిక సంఘం ఫిర్యాదు చేసింది. ఇది కబ్జాదారులపై మరింత ఒత్తిడి పెంచే కార్యక్రమంగా జరిగింది. తాము దేవాలయంగా భావించే కార్మిక భవనాన్ని అదే స్థానంలో నిర్మించే విధంగా చూడాలని, అందుకు సహకరించాలని కోరారు.
నేడు వరంగల్ కూరగాయల మార్కెట్లో సంతకాలు
అఖిల పక్షం సారథ్యంలో లక్ష్మీపురంలోని వరంగల్ కూరగాయల మార్కెట్లో గురువారం లక్ష సంతకాల సేకరణ జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, అఖిలపక్షం నుంచి ప్రముఖ రచయిత రామా చంద్రమౌళి, అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే లక్ష సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ కూరగాయల మార్కెట్లో చేపట్టే కార్యక్రమం ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చనుంది.
ఉద్యమానికి ఊపు
అజం జాహి కార్మిక సంఘం కలిసి రావడం భవన స్థల పరిరక్షణ ఉద్యమానికి ఊపు వచ్చినట్లయింది. ఇతర కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, అఖిలపక్ష నేతలు కలిసి రావడం ఉద్యమానికి కూడా కలిసి వచ్చింది. రాజకీయ పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్, సిపిఎం సిపిఐ, ఎం సి పి ఐ, న్యూ డెమోక్రసీ, ఐకాస, అఖిలపక్షంతో కలిసి పని చేయనుండటంతో అటు మిల్లు కార్మికుల్లో, అన్ని పక్షాల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. విజయం దిశగా పడుతున్న ‘అడుగు’ జాడలు కనిపిస్తున్నాయి.

