పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలా నగర్ వాసుల సమస్యలు తీవ్రంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారి వేదన విని బాధపడ్డానని, పరిస్థితులను దగ్గరగా చూసినప్పుడు ఆ బాధ మరింత పెరిగిందని తెలిపారు.
తాను కలెక్టర్, పోలీసు కమిషనర్‌లను సిబ్బందిని పంపాలని కోరినా, ఎవరూ స్పందించకపోవడం బాధకరమని పేర్కొన్నారు. ఇంకా, రాత్రి కొంత మంది గుండాలు ఇంటింటికి వెళ్లి ప్రజలను బెదిరించారని, ఎంపీ సభ వద్దకు వెళ్లవద్దని చెప్పిన దౌర్జన్యాన్ని నేరుగా చూశానని అన్నారు. ఈ గుండాల అరాచకాలను ఆపడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
ప్లాట్ ఓనర్లకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినా, రెవెన్యూ మరియు పోలీసు అధికారులు దానిని విస్మరించడం బాధాకరమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
గుండాల దౌర్జన్యంపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మహిళలపై దాడులు కలచివేశాయని, గత 25 ఏళ్లుగా ఎవరి మీద చేయి చేసుకొని నేను ఈ రోజు చేయి వేశనంటే ఇక్కడి ప్రజల పరిస్థితి అర్ధం చేసుకోవాలన్నారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.
బీజేపీ పార్టీ ప్రజలకోసం ఎల్లప్పుడూ పనిచేస్తుందని, రక్షణ కల్పించడంలో విఫలమైతే బీజేపీ ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నానని, తాను ఎప్పుడైనా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని చెప్పారు.

