నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో శనివారం మరణించారు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం, మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టర్‌గా సేవలందించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) తరపున విజయం సాధించి, 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో బీఆర్‌ఎస్ (BRS) తరపున పోటీ చేసి ఓడిన ఆయన, 2024లో బీఎస్పీలో చేరి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
మందా జగన్నాథం పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి మంద పుల్లయ్య నాగార్జున సాగర్‌లోని పైలాన్ కాలనీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. తల్లి మంద సవరమ్మ కూడా నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలో ఆఫీస్ అటెండెంట్‌గా పనిచేసారు. పాఠశాల రోజుల్లో, తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు జగన్నాథం సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు టెన్నిస్ బాల్ పికప్ బాయ్‌గా పనిచేశారు. వేసవి సెలవుల్లో నాగార్జున సాగర్ డ్యామ్‌లో వాటర్ బాయ్‌గా, మరికొన్ని సార్లు కూలీగా పనిచేసి చదువును కొనసాగించారు.
విద్యాభ్యాసం కూడా చాలా కష్టం మధ్య సాగింది. ఆయన నాగార్జున సాగర్ హిల్‌కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుని, హైస్కూల్ వరకు అక్కడే చదివారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS కోర్సు పూర్తిచేసి, సర్జన్‌గా సేవలు అందించారు. ఆయన సూర్యాపేట సివిల్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ సర్జన్‌గా, గాంధీ ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఈఎన్‌టీ సర్జన్‌గా పనిచేశారు.
ప్రజాసేవకు మక్కువ చూపించిన మందా జగన్నాథం, రాజకీయాల్లో భాగమై ప్రజలకు సేవలు అందించారు. ఆయన మరణంతో రెండు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఎంతో గౌరవనీయమైన వ్యక్తి కోల్పోయింది.

