గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గించడమే కాకుండా, విద్యుత్ చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే అంతరాయాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్స్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. విద్యుత్, టెలికమ్, డేటా వంటి అన్ని రకాల కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ చేయాలని ఆదేశించారు.
రాబోయే వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరింతగా, ఆదివాసీ గూడెల్లో గృహాలకు సోలార్ విద్యుత్, సోలార్ పంపు సెట్‌లు ఉచితంగా అందించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

