కొత్త పథకాలను సరిగ్గా అమలు చేయండి
-కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలో పలు కొత్త పథకాల అమలు, లబ్దిదారుల జాబితా తయారీపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల అమలుకు ప్రభుత్వం జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి సదస్సు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకాలపై గ్రామాలు, మున్సిపాలిటీల స్థాయిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించేందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
రైతు భరోసా పథకం అమలులో వ్యవసాయానికి అనుకూలమైన భూములకు మాత్రమే సాయం చెల్లించాలని స్పష్టం చేశారు. వ్యవసాయానికి అనర్హమైన భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్ భూములు, మైనింగ్ భూములు, ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలు సేకరించి పథకం పరిధిలో నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. ఈ రికార్డులను గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ రెవెన్యూ రికార్డులతో సమన్వయం చేసి గ్రామసభల్లో ప్రజల ముందు ఉంచాలని ఆదేశించారు.
ప్రతి ఎకరం వ్యవసాయ భూమికి పంట వేసినా వేయకపోయినా రైతు భరోసా అందించాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఎలాంటి అనుమానాలు లేదా అపోహలు లేకుండా గ్రామస్థాయిలో ఫీల్డ్ పరిశీలనలు పూర్తి చేయాలని, వ్యవసాయ యోగ్య భూముల జాబితా పకడ్బందీగా తయారుచేయాలని సూచించారు. ఈ పథకాల అమలుతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.

