ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ దర్యాప్తు తీవ్రత పెంచింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఈరోజు ఉదయం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మూడు గంటల పాటు అరవింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి రూ.55 కోట్ల నిధుల మళ్లింపు విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం నిధిని హెచ్‌ఎండీఏ విదేశీ కంపెనీకి చెల్లించిందని, ఆ నిధుల నగదు బదిలీ వెనుక అసలు కారణం ఏమిటి, ఈ నిర్ణయం ఎవరి ఆదేశంతో తీసుకున్నది, ఆర్బీఐ అనుమతి పొందినదా అనే ప్రశ్నలను అరవింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అడిగారు. ఈ ప్రశ్నలకు అరవింద్ కుమార్ కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు విడుదల చేశామని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం, ఈ విచారణ మొత్తాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేస్తున్నట్లు తెలిసింది.

