సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ ప్రముఖులు అనేక అంశాలను ప్రస్తావించారు. అనుమానాలు, అపోహలు పంచుకుంటూ, టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను సిఎం దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ…మా ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇప్పటివరకు ఎనిమిది సినిమాలకు ప్రత్యేక జీవోలను మంజూరు చేశాం. ‘పుష్ప’ వంటి సినిమాలకు పోలీస్ గ్రౌండ్ అందించాం. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అన్నారు.

తెలంగాణలోని సినిమా పరిశ్రమకు అండగా నిలుస్తామని చెబుతూ, సినీ పరిశ్రమ మరియు ప్రభుత్వం మధ్య సంబంధాలను బలపరచడానికి దిల్ రాజు ను ఎఫ్‌డిసీ ఛైర్మన్‌గా నియమించామని తెలిపారు. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని, సినిమా షూటింగ్ కోసం అనుకూలమైన వాతావరణం అందుబాటులో ఉందని సీఎం వివరించారు.

తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొంటూ, హాలీవుడ్, బాలీవుడ్‌ను హైదరాబాద్ వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

ముఖ్యంగా, డ్రగ్స్, గంజాయి వంటి సామాజిక సమస్యలపై సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సూచించారు. పరిశ్రమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాధాన్యతనిచ్చిందని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

