కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండో రోజు గురువారం కొనసాగింది. ఈ విచారణలో భాగంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్‌ను కమిషన్ విచారించింది. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు.
మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి నిన్న విచారణ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులేనని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దాంతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
కమిషన్ ప్రశ్నల సందర్భంగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టడానికి గల కారణాలను శైలేంద్ర కుమార్ జోషి వెల్లడించారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తగ్గనుందని కేంద్ర జలవనరుల సంఘం సూచించడంతో, ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిజర్వాయర్ల నీటి సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
మేడిగడ్డ నిర్మాణంపై నిర్ణయాలు కేసీఆర్ నేతృత్వంలో వ్యాప్కోస్ కమిటీ, సీఈ, సీడీవో, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో తీసుకున్నట్లు శైలేంద్ర కుమార్ వివరించారు. 2016 మే 2న కేసీఆర్ భూమిపూజ చేసి, మూడు బ్యారేజీల నిర్మాణం ప్రారంభించారని చెప్పారు. అదే రోజు ప్రాణహిత-చేవెళ్ల పేరును మార్చినట్లు తెలిపారు.
కమిషన్‌కు సంబంధించిన ప్రశ్నలపై శైలేంద్ర కుమార్ సమాధానమిస్తూ, స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) లక్ష్యాలు, బాధ్యతలు వివరించారు. ఐదుగురు చీఫ్ ఇంజనీర్లతో కమిటీ ఉంటుందని, ప్రాజెక్టు అంచనాలపై చర్చించి, లోపాలను సవరించాలని సూచిస్తుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 28 ప్యాకేజీలు, 8 లింకులుగా ఉండేలా మార్పులు చేసినట్లు వెల్లడించారు.
గూగుల్ మ్యాప్ ఆధారంగా కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. మొత్తం 200లకుపైగా పనులకు పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. కానీ, మేడిగడ్డ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సంస్థ కొన్ని బ్లాకులను వేరే సంస్థతో కట్టించిందా అనే ప్రశ్నకు, ఆ సమాచారం తనకు తెలియదని జోషి చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతోంది.

