ఉద్యమ జ్వాలల్ని రగిల్చిన శ్రీకాంతాచారి ఆత్మాహుతి
1948లో హైదరాబాద్ దేశంలో విలీనమయింది. 1956తో భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. విలీనాన్ని ఆనాటి నుండే వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమాల్లో ప్రధానమైనవి 1958 ఉద్యమం, 1969లో సాగిన ఉద్యమం, 2001లో మొదలైన మలి ఉద్యమం అయితే, తెలంగాణ ఏర్పాటుకు అంకురార్పణ గావించినది నవంబర్ 29న మొదలైన దీక్షా దివస్. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా స్పందించడానికి కారణమైంది.
తెలంగాణ మలిదశఉద్యమం అనేక అనూహ్య మలుపులు తిరుగూ దీక్ష దశకు చేరుకుంది. ఉద్యమంలో భాగంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబరు 29న నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అనేకానే పరిణామాలు, వాదవివాదాలు, ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం తర్వాత డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తరువాత తన 11 రోజుల దీక్షను విరమించారు.
హైదరాబాద్, నవంబర్ 28 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసాయి. కేంద్రం ఉపశమన చర్యలతో ఉద్యమం చల్లారకపోగా, తీవ్రతరం అవుతూ వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ పూనుకున్నారు. ‘తెలంగాణ వచ్చుడో…కేసిఆర్ సచ్చడో’ అన్న నినాదంతో 2009, నవంబర్ 29వ తేదీన ఆమరణ దీక్షకు దిగారు.
కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలానికి బయలు దేరిన కేసీఆర్ ను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు అడ్డుకున్నాయి. కేసీఆర్ ను తన వాహనం నుంచి బలవంతంగా దించివేయడంతో, రోడ్డుమీదే ధర్నా ప్రారంభించారు. దీంతో కేసీఆర్ ను వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు. వాదవివాదాల మధ్య ఆ జైలులోనే తన దీక్షను కొనసాగించారు.
శ్రీకాంతాచారి ఆత్మాహుతి
2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో కాసోజు శ్రీకాంతాచారి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఉద్యమజ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ కూడా జై తెలంగాణ! అంటూ నినదించాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియా, చివరకు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009 న తుదిశ్వాస విడిచాడు. మత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణే చేశాడు. ‘బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమ’న్నాడు. తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో బూడిదవుతుంటే టీవీల్లో చూసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెలవిసి, రగిలిపోయాయి. ఉద్యమానికి ఉద్యుక్తులయ్యేలా ఉద్యమజ్వాల రగిలించాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన శ్రీకాంతచారి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయాడు. శ్రీకాంతాచారి స్వగ్రామం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి. గొల్లపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆ గ్రామస్థులు ప్రతిష్టించారు.
దీక్ష పర్యవస పరిణామాలు
డిసెంబర్ 1న ‘నేను లేకున్నా ఉద్యమం నడవాలి’ అని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2న పార్లమెంట్‌లో అద్వానీ కేసీఆర్ దీక్షను ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో 3న కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ కు తరలించారు. ‘తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర’ అని నిమ్స్ నుంచే కేసీఆర్ ప్రకటించారు. రక్తంలో పొటాషియం, సోడియం తగ్గడంతో కేసీఆర్‌ను అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. కోమాలోకి పోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరించారు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితేనే విరమిస్తానని చెప్పారు. దాంతో రాష్ట్ర రాజధాని ఫ్రీ జోన్ కాదని అసెంబ్లీలో తీర్మానం పెడతామని, కేసీర్‌పై కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 6న అసెంబ్లీలో 14ఎఫ్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. అయినా, నిరసనలు ఆగలేదు. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే మారుమోగింది. బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా సబ్బండ వర్గాలు, కులాలు ఒక్కటయ్యారు.
డిసెంబర్ 9 ప్రకటన
డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న కేసీఆర్ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నదని, తమ చేతుల్లో ఏమీలేదని వైద్యులు ప్రకటించారు. తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. చిదంబరం ఫోన్‌లో కేసీఆర్, జయశంకర్ తో సంభాషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనపై సమాలోచనలు జరిగాయని చెప్పారు. రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్న సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటన వెలువరిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని, విద్యార్థులు, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని ప్రకటించారు.
2014లో తెలంగాణ రాష్ట్ర అవతరణ
ప్రకటన అనంతరం నిమ్స్ నుంచి ‘ఇది తెలంగాణ ప్రజల విజయం’గా కేసీఆర్ తన 11 రోజుల సుధీర్ఘ దీక్షను విరమించారు. అయితే, ఆతర్వాత ఆంధ్రాలో జై ఆంధ్ర ఉద్యమం లేపారు. ఈ ఉద్యమం తెలంగాణ ఏర్పాటును మరికొంత కాలం ఆలస్యం చేసింది. చివరకు 2014 ఫిబ్రవరి 18న పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అదే రోజున లోక్ సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందింది. మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం పొందింది. జూన్ 2, 2014న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.

