VILLAGES|గ్రామాల్లో వేలంపాటల హడావిడి
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ పదవుల కోసం భారీ మొత్తాలతో జరుగుతున్న ఒప్పందాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లా టంకర్ గ్రామ పంచాయతీలో స్థానిక వ్యాపారి సర్పంచ్ పోస్టును ఏకగ్రీవం చేసుకునేందుకు రూ.1 కోటి వరకు చెల్లించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగించాలనే షరతుపై ఒప్పందం కుదిరిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇక గద్వాల జిల్లాలోనూ పరిస్థితి కూడా భిన్నంగా ఏమి లేదు. కొండపల్లి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం రూ.60 లక్షలు, గొర్లఖాన్ దొడ్డి గ్రామంలో రూ.57 లక్షలు, చింతలకుంటలో రూ.38 లక్షలు, ముచ్చోనీ పల్లిలో రూ.14.90 లక్షలు, ఉమిత్యాల తండాలో రూ.12 లక్షలు వేలం పాడినట్లు తెలిసింది. ఏకగ్రీవాల పేరిట జరుగుతున్న ఈ ఆర్థిక లావాదేవీలు గ్రామ స్థాయి ప్రజాస్వామానికి భంగం కలిగిస్తున్నాయని పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి పేరుతో వసూలు చేస్తున్న కోట్ల రూపాయల ఒప్పందాలు పాలన పారదర్శకతకు భంగం కలిగే అవకాశం ఉంది.

