జ్యోతి ప్రజ్వలనం చేయనున్న శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభుజీ, ఎమ్మెల్యే యశస్విని|MLA|YASHASWINI
భారీ ఎత్తున తరలిరానున్న భక్తులు
అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
పాలకుర్తి, నవంబర్ 4 (అడుగు న్యూస్):
ఆధ్యాత్మికత, విశ్వాసం, భక్తి పరవశం సమ్మేళనంగా జనగామ జిల్లా, పాలకుర్తి మండలకేంద్రంలో స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత పదకొండు ఏళ్లుగా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జరిపే ఈ మహోత్సవం ప్రజల్లో ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, దక్షిణ భారతదేశంలో అఖండజ్యోతి నిర్వహిస్తున్న 3వ దేవస్థానంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంవత్సరం ఈ మహోత్సవంలో భక్తజనసంద్రం ఈసారి మరింతగా పెరిగే అవకాశముందని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

అఖండ జ్యోతి మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ పరిసరాల్లో దీపాలంకరణలు, పుష్పాలంకరణలు విశేష వాతావరణం నెలకొంది. ప్రతి సంవత్సరం వున్న పద్ధతి ప్రకారం పీఠాధిపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారుఈ సంవత్సరం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజారామ్మోహన్ రెడ్డి దంపతులు, ఆధ్యాత్మిక పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ రామానంద ప్రభుజీ తో కలిసి స్వయంగా అఖండ జ్యోతి ప్రజ్వలనం చేయనున్నారు. ఈ సందర్భంగా వారు భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ, లక్ష దీపోత్సవం తో పాటు జ్యోతి ప్రజ్వలనంకు ముందు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజలు ధర్మం, సత్సంకల్పం, ఐక్యత అనే సందేశంతో అఖండ జ్యోతి నుంచి వెలువడే ఆధ్యాత్మిక కాంతిని స్వీకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యంగా ఆలయ పూజారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ అఖండ జ్యోతి సందర్భంగా భక్తుల రాకపోకలు, భద్రతా చర్యలను సిఐ జానకిరామ్ రెడ్డి స్వయంగా ఆలయ పరిసరాలను పరిశీలించారు. పోలీసు సిబ్బంది, వాలంటీర్లను సమన్వయం చేస్తూ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, వైద్య సహాయం వంటి అంశాల్లో కూడా పూర్తి ఏర్పాట్లు చేయబడుతున్నాయని తెలిపారు.

మొత్తానికి, ఈసారి పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అఖండ జ్యోతి మహోత్సవం భక్తి, విశ్వాసం, సంస్కృతి, శాంతి విలువలను ప్రతిబింబించే మహోత్సవంగా నిలవబోతోంది. వేలాది మంది భక్తులు పాల్గొని జ్యోతి దర్శనంతో దైవానుగ్రహం పొందేందుకు సిద్ధమవుతున్నారు. దివ్య జ్యోతి వెలుగుతో పాలకుర్తి ప్రాంతం ఆధ్యాత్మిక కాంతితో ప్రకాశించబోతోంది.
అఖండ జ్యోతి అనేది సృష్టి తత్త్వానికి ప్రతీక. దీపం వెలిగించడం అంటే మనలోని చీకట్లు తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం. ఈ ఆలయంలో గత 11 ఏళ్లుగా అఖండ జ్యోతి మహోత్సవం జరుపుతున్నాం. కార్తీక మాసం శివకేశవులకు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం కావున శివకేశవులను దర్శించి పూజించి తరించవలసిందిగా కోరుచున్నాము.

-దేవగిరి లక్ష్మన్న
ఆలయ ప్రధాన అర్చకులు
భక్తి పరవశంతో అఖండ జ్యోతి ముందు ప్రార్థన చేసినవారికి అనుగ్రహం లభిస్తుంది. ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగించడం మన సంస్కృతికి గర్వకారణం. శ్రీ సోమేశ్వర స్వామి ఇలవేలుపు భక్తుడికి దశాబ్ద కాలం క్రితం స్వామి వారు స్వప్నం లో సాక్షాత్కరించి అరుణాచలం వలె క్షీరగిరి పైన కూడా అఖండ జ్యోతి వెలిగించమని కోరగా ఆ భక్తుడు గత 11 సంవత్సరాల క్రితం ఆరంభం చేసిన ఈ కార్యక్రమం నేటికి 11 వ వార్షిక ఉత్సవం గా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం

-దేవగిరి రమేష్ శర్మ
ఆలయ ఉప ప్రధాన అర్చకులు
అఖండ జ్యోతి ప్రజ్వలన సమయంలో వాయు, అగ్ని, ఆకాశం తత్త్వాలు సమతుల్యమవుతాయి. ఆ దివ్య శక్తిని అనుభవించడం భక్తుల పుణ్యం. కార్తీక పౌర్ణమి రోజున దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి, దీపారాధన చేసి, అఖండ జ్యోతి దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం

-దేవగిరి అనిల్ శర్మ
ఆలయ అర్చకులు
అఖండ జ్యోతి కేవలం దీపం కాదు, అది దైవానుగ్రహానికి ప్రతిరూపం. ఇక్కడ పూజించిన ప్రతి ఒక్కరికీ శాంతి, సంపద, ఆరోగ్యం లభిస్తాయి కావున భక్తులు హాజరై పాలకుర్తి స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని తరించండి.

-మత్తగజం నాగరాజు శర్మ
ఆలయ అర్చకులు

