JUBILEE HILLS|జూబ్లీ గెలుపే కీలకం
MUSLIMS|ముస్లీంల ఓట్లకై గాలం
రేపు మంత్రిగా AZAHARUDDIN|అజహర్ ప్రమాణం?
AIMIM|ఎంఐఎం వ్యతిరేకం
అజహర్ కే అధిష్టానం
అజ్జూకే సై అన్న సీఎం|CM|REVANTH REDDY
హైదరాబాద్, అక్టోబర్ 29 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టీమిండియా పూర్వ కెప్టెన్, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజహరుద్దీన్ కి కలిసొచ్చింది. జూబ్లీలో మైనార్టీ ఓట్లే కీలకం కావడం అజహర్ ని కీలకం చేసింది. గతంలో జూబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహర్, పార్టీ మాట మీద ఈసారి నవీన్ కోసం పోటీ నుంచి తప్పుకోవడం ఆయన సిన్సియార్టీకి కారణమైంది. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే ఆయనను మంత్రి పదవి వరించనుంది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ చేయని ఎంఐఎం వ్యతిరేకించినా, సీఎం రేవంత్ రెడ్డి సై అనగా, కాంగ్రెస్ అధిష్టానం అజహరుద్దీన్ నే ఎంచుకుంది. దీంతో అజ్జూ భాయ్ రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అటు కాంగ్రెస్ కు, ఇటు బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దివంగతులవడంతో అనివార్యమైన జూబ్లీ ఉప ఎన్నికలో విజయం కూడా రెండు ప్రధాన పార్టీలకు అనివార్యంగా మారింది. జూబ్లీని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ కు, గెలవడం అధికార కాంగ్రెస్ కు ప్రాధామ్యంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రెండు పార్టీలు రాష్ట్రంలోని తమ కేడర్ మొత్తాన్ని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే మోహరించాయి. కాంగ్రెస్ డివిజన్ కు ఇద్దరు మంత్రులు చొప్పున బాధ్యతలు అప్పగించిగా, మాజీ మంత్రులు, ముఖ్య నేతలందరినీ బీఆర్ఎస్ జూబ్లీలో దింపింది. ఇదే సమయంలో కులాలు, మతాల వారీగా ఓట్లు కీలకం కావడంతో ఆయా ఓట్లు లక్ష్యంగా ఆ రెండు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగాయి. ముస్లీంలకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని, రెండేండ్లు పూర్తి కావస్తున్నా, మంత్రివర్గంలో ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శించింది. ఇదే అదనుగా కాంగ్రెస్ తమదైన శైలిలో మైనార్టీకి మంత్రి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది.
జూబ్లీ హిల్స్ లో మతాలు, కులాల వారీగా ఓటర్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఓటర్లలో బీసీలు 1.34 లక్షల మంది ఉండగా, ముస్లింలు 1.20 లక్షల మంది ఉన్నారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు 22,746 ఉన్నాయి. రెడ్డి ఓట్లు 17,641 ఉన్నాయి. ఎస్సీల ఓట్లు 28,350 కాగా, ఎస్సీల్లో మాదిగ ఓట్లు 15,693, మాల ఓట్లు 12657 ఉన్నాయి. లంబాడీల ఓట్లు 11364, క్రైస్తవుల ఓట్లు 19,396 ఉన్నాయి.
కీలకంగా మారిన ముస్లింల ఓట్లు
మొత్తం ఓట్లల్లో 25శాతానికి మించిన ఓట్లు ముస్లీంల ఓట్లే ఉన్నాయి. ఈ ఓటర్లను ఆకర్షించడం అన్ని పార్టీలకు ముఖ్యమైంది. బీజేపీకి ఎలాగూ పడని ముస్లింల ఓట్లు గతంలో బీఆర్ఎస్ కు పడ్డాయి. కానీ ఈసారి ఎన్నికల్లో నవీన్ గతంలో ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి అభ్యర్థి పోటీలో లేరు. మద్దతు కాంగ్రెస్ కు ప్రకటించినప్పటికీ, ఆ ఓట్లు ఎటు పడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు కాంగ్రెస్ ముస్లింలకు ఏం చేసిందని బీఆర్ఎస్ ప్రశ్నించడంతో ముస్లింల ఓట్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పడింది.
గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లిచ్చినప్పటికీ పెద్దగా ఎవరూ గెలవలేకపోయారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. గతంలో జూబ్లీ నుంచే పోటీ చేసిన అజహరుద్దీన్ 16వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు. ముస్లిం లెజిస్టేచర్లలో కనీసం ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం ఆనవాయితీ. దీంతో రెండేండ్లు కావస్తున్నా ఎవరికీ అవకాశం రాలేదు.
పార్టీ ఆదేశం.. ఉప ఎన్నికకు దూరం
అజహరుద్దీన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మళ్ళీ పోటీ చేయాలని భావించారు. కానీ ఆ స్థానం నవీన్ యాదవ్ కు దక్కింది. దీంతో అజహర్ ను ఎమ్మెల్సీని చేయాలని కోదండరామ్ 10తో కేబినెట్ గవర్నర్ కు సిఫారసు చేసింది. అది పెండింగులో ఉంది. అయినప్పటికీ అజహర్ ను మంత్రిని చేయాలని సీఎం సహా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
అజ్జూ భాయక్ కే అవకాశం
ప్రస్తుత మంత్రివర్గంలో 15మంది మంత్రులుండగా, మరో ముగ్గురికి అవకాశం ఉంది. ప్రస్తుతం అజహరుద్దీన్ కు మాత్రమే మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని అజహర్ ని మంత్రిని చేసి, వచ్చే 6 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో అజహర్ ని గెలిపించాలని పార్టీ భావిస్తోంది.
కాగా, మొదటి సారి 12మంది మంత్రులు ప్రమాణం చేయగా, ఇటీవల ముగ్గురికి అవకాశం దక్కింది. మరో ముగ్గురికి ఉన్న అవకాశాల్లో ఇప్పుడు అజహర్ మంత్రి అవుతున్నారు. మరో రెండు ఖాళీలను నింపడానికి సామాజికి, ప్రాంతీయ సమీకరణలను చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రస్థానమిలా
టీమిండియా కెప్టెన్ గా క్రికెట్ ఆడిన అజహర్ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిఓడిపోయారు. అజహరుద్దీన్ 2019 ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ ఇప్పుడు ఏకంగా మంత్రి అవుతున్నారు. కాగా, 28ననే అజహర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీ గా ఉండాల్సిందిగా సీఎం అజహర్ ను కోరినట్లు తెలిసింది.

