మెరిసే బంగారమైనా, యెండైనా పెయి మీద నాలుగు రోజులుంటే నల్లబడ్తయి. మైల బట్టి యికారం అయితయి. ఇగ గవాట్ని మిలమిల మెరిటట్లు సేయాల్నంటే, గా ఔసులాయన దగ్గరికిపోవాలె. కాస కడిగియ్యాల్నంటే కాసిన్ని కాసులు కావాలె. గంత పని లేకుండ, యింట్లనే గవాట్ని మెరిపించే శిట్కా శెప్త సూడుండ్లి.

గిన్నెల గిన్ని నీల్లు తీసుకోవాలె. గవాట్ని పొయ్యిమీద పెట్టి సలసల కాగిపియ్యాలె. ఇగ గప్పుడు గా యేడేడి నీల్లల్ల మనింట్ల ఉండే గింత సబ్బు సూర పొయ్యాలె. గది కరిగేదాక కాస కలెబెట్టాలె. గా గిన్నెల్నే యెండి వస్తువుల్ని ఏయాలె. కాసేపైనంక గవాట్ని బటయకి తీసి కాసేపు శెయ్యితోటో, పండ్లు తోముకునే పాడైన బ్రష్ తోటో కాస అటు ఇటు రుద్దాలె. గంతే గా యెండి వస్తువుల మైల శిడెంల పోయి గయి మిలమిల మెరుస్తయన్నట్లు. ఎట్లుంది గీ శిట్కా…? మీరూ శేసి సూడుండ్లి!

