
ఎక్కడైనా సచ్చిపోయినంక ఆళ్ళ యిగ్రహాలు పెడతరు. ఏడాదికోపాలి పూజిత్తరు. కనీ, ఎవరి యిగ్రహాలు ఆల్లు పెట్టకోరు గద? గిదేం ఇచ్చెంత్రమో గనీ, ఇగ ఒకాయినె బతికుండంగనే గాయినె యిగ్రహాన్ని గాయినే పెట్టకుండు. గాయినతోపాటు గాయిన ఇల్లాలి యిగ్రహాన్ని గూడ పక్కపక్కనే పెట్టిండు. ఇగ గాయినే గా రొండు యిగ్రహాల్ని ఇయ్యాల్నే ప్రారంభిస్తుండు.?!
గాయిన పేరు కల్లెం నర్సింహారెడ్డి. గాయినకు 89 ఏండ్లుంటయి. 30 ఏండ్లు అమెరికాల్నె ఉన్నడు. గాడ యవుసం చేసిండు. ఐదు యేల ఎకరాలు కౌలుకు తీసుకుని మస్తు రకరకాల పంటలు పండిచ్చిండు. గా అమెరికా అధ్యక్చుడు జిమ్మీ కార్టర్ శేతుల మీదికెలి ఉత్తమ రైతు అవార్డు కూడ అందుకున్నడు. కొన్నేండ్ల కిందట్నే ఉన్న ఊరు, కన్న తల్లి గుర్తొచ్చినయి. ఇగ గిదంత పని కాదని, ఊరికి తిరిగొచ్చిండు. చిలుకూరుకు కూతవేటు దూరంల భూమి కొని యవుసం శేత్తాండు. రకరకాల మొక్కలు, చెట్లు పెంచుకుంట పల్లె తల్లి పకృతి ఒడిలోనే కాలం ఎల్లదీత్తాండు. గీ మద్దెల్నే గాయిన యిల్లాలు లక్ష్మి కాలం శేసింది. ఇగ గా కల్లెం నర్సింహారెడ్డి ఊకుండలే. పానానికి పానమైన తన భార్య లక్ష్మి యిగ్రహాన్ని శేయించిండు. గామె యిగ్రం ఒంటరిగుండొద్దని, పక్కనే తన యిగ్రహాన్ని గూడ శేయించి పెట్టిండు. గవాట్ని రాజస్థాన్ ల శేయించిండంట. గయి పానం ఉన్న మనుసుల్లెక్కనే ఉన్నయి! గాయిన భార్య లక్ష్మీ కాలం శేసి, అప్పుడే ఏడాదైతాంది. ఇగ గిదే సరైన టైమని గవాటిని గూడ గాయినే ఆవిష్కరిస్తాండంట!
ఎట్లుంది, ఎల్లలు లేని గీ కల్లెం నర్సింహారెడ్డి పేమ? మస్తుగుంది కదా!? మనషంటే… మని ఉండంగనే కాదుల్లా, సచ్చినంక కూడ బతకాలె!?*

