
గిదేం ఇచ్చెంత్రం!? అనిపిత్తాంది కదా! నిజంగా నిజమేనుల్లా! మీ మీదొట్టు. నమ్ముండ్రి. గంతే! జేబుల్ల.. శేతుల్ల.. శెవుల్ల… శివరాకరికి ఉచ్చ పోసే కాడ, పాయఖానకు పోయే కాడ, రేవు కాడ, సావుకాడ.. యేడ సూడు పోనేనాయె. సంటోని గానించి ముసలోని దాగా.. బువ్వ తినాల్నెన్నా, ఏడ్వాల్నెన్నా, యేడ్వకుంట ఉండాల్నెన్నా, నవ్వాల్నన్నా పోనే నాయె. శిడెంకోపాలి పోను సూసుకుంట, గడియ సేపు రికాం ఉంటలేరాయె. గిది బాగా కనిపెట్టినోకాయెనకు కనికట్టులాంటి ఐడియా వచ్చింది. గదే గీ ముచ్చట.
పంజాబ్ రాస్ట్రం, మెగా జిల్లా గోలియ ఖుర్దు ఊరోల్లు ‘గ్రేట్ సిట్టింగ్ చాలెంజ్’ పేరుతోటి, గీ పోటీ పెట్టిండ్రు. గా ఊల్లె జనానికి పోను మాట్లాడు యసనం అయిందంట. గదాన్ని పోగొట్టాలని గీ ఉపాయం శేశిండ్లు. గీ పోటీల పాల్గొనేటోల్లు పోను లేకుండ ఓ శోట కూసోవాలె. నిద్ర పోవద్దు. ఒంటెలుకు గూడ పోయొద్దు గంతె. గనీ దూపైతే, ఆకలేత్తే కూసున్న కాడికే నీల్లు, అన్నంత తెస్తరు. గట్లనే ఎవ్వలు ఎక్కువ సేపు కూసుంటే గవాళ్ళకే ప్రైజులిస్తరు. పస్టు ప్రైజు సైకిలుతో కలిపి రూ.4,500, రెండో ప్రైజు రూ.2,500, మూడో ప్రైజు రూ.1,500 ప్రకటించిండ్లు. గీ పోటీల శిన్నా, పెద్ద అందరూ పాల్గొనచ్చని సాటింపేసిండ్లు. ఇగ గీ పోటీల 55మంది కూసున్నరట. ప్రైజులు ఎవరికొస్తయో ఏమో గనీ, గిట్ల శేస్తే, గా పోన్లకు అలవాటు పడ్డోల్లు గవాటికి దూరమైతరని గిట్ల శేస్తారంట. మన దగ్గర గూడ గిట్లాంటి పోటీలు పెడితే బాగుండు గదా?

