
గా ఎంకి పెండ్లి గీ సుబ్బి సావుకొచ్చిందంటే నిజమే! యెన్కటికీ గీ సామెతలు ఊకనే సెప్పలే. అనుబవంతోనే సెప్పిండ్లు. గయి యింకా నిజమైతనే ఉన్నయి. గీ సామెత గీ యిషయంలో గూడ నిజంగా నిజమైంది.
గాయినకేదో పెయి బాగ లేదని, ఇగ బాగ్గావాలని గా ఊల్లెకు పోయి మనం ఉప్పలమ్మకు, మశమ్మకు, మారెమ్మ, ముత్యాలమ్మకు మొక్కుకున్నట్లే మొక్కుకున్నడట. ఇగ పెయి బాగైందో లేదో, మొక్కుకున్నది మొక్కుకున్నట్లే సేసిండంట. గా మొక్కే గిప్పుడు గా మేకల పానం మీదకొచ్చింది.
తిమిళనాడు రాస్ట్రం, ధర్మపురి జిల్ల, పెన్నాగరం తాలుకా, ఎరియూర్ కు దగ్గర్ల ఉన్న అత్తి మరత్తూర్ అనే ఊల్లె తంగరాజ్ అని ఒగాయిన ఉన్నడు. గాయిన లారీలను నడుపుతడు. ఒకపాలి గాయినకేదో మాయ రోగం వచ్చిందంట. గా రోగం సిన్న సిన్న దవాఖాన్ల నుంచి పెద్ద పెద్ద దవాఖాన్ల దాకా, ఎన్ని దవాఖాన్లు తిరిగినా పోలేదట. ఇగ గీడ గాడ ఏమిన్నడొ గనీ, గిదంత పని గాదని, గా ఊరు పక్కనె ఉన్న బి.అగ్రహారంల ముత్తు మరియమ్మన్ అనే గుడిలకు పోయిండు. ఉంటె తన పానం ఉండాలె పోతే గా మేకల పానం పోవాలనుకున్నడు. తన పెయి బాగైతే 151 మేకల్ని కసా కసా కోస్తనని మొక్కుకున్నడు. ఇగ గదేం మాయ రోగమో గని, గీ మొక్కు మొక్కకున్నంక గా రోగం కాస, ఉఫ్ మని ఊదినట్లె పోయిందట.
ఇగ మయిమ గల్ల దేవతాయె. నయంగాని రోగం నయమాయె. ఇగ గా మొక్కు తీర్చుకోకుంటే గామె ఊకుంటాది. మల్లేమన్న జేస్తే. ఊరు గాలి గత్తరైపోదు? అమ్మో ఇంకెమన్న ఉన్నదా? అనుకున్నడట. 151 మేకల్ని తెచ్చిండంట. పరా పరా గదే, రప్పా రప్పా కోపిచ్చిండంట. గన్ని మేకలాయె? ఏం జేయాల్నని, ఇగ గా మేక శియ్యల్ని ఒండిపిచ్చిండంట. వచ్చినోనికి వచ్చినట్లు వడ్డించిండంట. ఇగ గీ లెక్క తీస్తే గాయనకు పది లచ్చల ఖర్చు అయిందంట. గాయిన రోగం గా మేకల పానం మీదకొచ్చిందాయె. యే గా మేకల పానం పోతే పోయింది గనీ, నా రోగం గూడ నయమైంది గద, అనుకుంట గాయన మస్తు సంబర పడ్తాండట.

