భక్తులకు మధ్యప్రదేశ్ సీఎం విజ్ఞప్తి
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ప్రయాగ్రాజ్ రహదారులు కిక్కిరిసిపోయాయి. ప్రత్యేకంగా మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు.
రాబోయే రెండు రోజుల పాటు ప్రయాగ్రాజ్ వైపు వెళ్లొద్దని, ట్రాఫిక్ తీవ్రంగా పెరిగినందున ప్రయాణాలు మానుకోవాలని కోరారు. ప్రయాణికులు గూగుల్ మ్యాప్స్‌లో ట్రాఫిక్ స్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
అంతేకాదు, ప్రయాణికుల కోసం నీరు, ఆహారం, ఇతర అత్యవసర సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యూపీ అధికారులతో సమాలోచనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

